ఇండియన్ స్టాక్ మార్కెట్ ఘోరంగా పడింది. 2026, మార్చి 23వ తేదీ సోమవారం ఉదయం ప్రారంభం నుంచే నష్టాల్లోకి వెళ్లింది. అటుఇటు అని ఏమీ లేదు.. ఊగిసలాట అంతకన్నా లేదు.. దారుణంగా పడిపోయింది. సెన్సెక్స్ 15 వందల పాయింట్లు.. నిఫ్టీ 500 పాయింట్లపైగానే నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 3 శాతం, మిడ్ క్యాప్ షేర్లు 2 శాతం నష్టపోయాయి. టాప్ 50 షేర్లలో కేవలం రెండు అంటే 2 షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. మిగతా అన్ని షేర్లు రెడ్ లో ఉన్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం.. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మరింత తీవ్రంగా ఉండటంతో మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు రక్త కన్నీరు పెట్టించింది. అదీ ఇదీ అని లేదా.. అన్ని షేర్లు ఢమాల్ అన్నాయి.
ఇరాన్ యుద్ధ భయాలు, ఆయిల్, గ్యాస్ సంక్షోభంతో ఇండియన్ మార్కె్ట్లు భారీగా పతనమయ్యాయి. ఉదయం 9.55 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 1621.88 పాయింట్లు పడిపోయింది. అంటే 2.18 శాతం సెన్సెక్స్ ఫాల్ అయ్యి 72,911.08 స్థాయికి చేరుకుంది. అదే విధంగా బేర్ పంజాతో నిఫ్టీ 514.30 పాయింట్లు లేదా 2.23 శాతం పడిపోవడంతో నిఫ్టీ 22,600.20 రేంజ్ ను తాకింది.
బేర్ పంజాతో స్టాక్ మార్కెట్లో రక్క కన్నీరు ప్రవహిస్తోంది. 2990 షేర్లు పడిపోగా కేవలం 153 షేర్లు మాత్రమే స్థిరంగా ఉన్నాయి. ఇరాన్-అమెరికా యుద్ధం నాలుగో వారంలోకి ఎంటర్ అవుతున్నా ఇంకా యుద్ధం ముగుస్తుందా లేదనే క్లారిటీ లేకపోవడంతోనే భారీగా పడిపోతున్నట్లు జియోజిత్ ఇన్ వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ డా.విజయ్ కుమార్ తెలిపారు.
- గెయినర్స్:
మార్కెట్ లో బ్లడ్ బాత్ కొనసాగుతున్న పరిస్థితుల్లో HCL టెక్నాలజీస్, TCS (టాటా కన్సల్టెన్సీ) మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ రెండు కంపెనీలు వరుసగా 0.78, 0.24 శాతం లాభాలతో ఉన్నాయి.
- లూజర్స్:
ఇక ఇవాళ్టి మార్కెట్లో టాటా స్టీల్ అత్యంత దారుణంగా పడిపోయింది. మార్కెట్ ఓపెనింగ్ తోనే 4.30 శాతం పడిపోయి ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చింది. అదానీ పోర్ట్స్ 3.91, బజాజ్ ఫినాన్స్ 3.58, టైటాన్ కంపెనీ 3.51, భారత్ ఎలక్ట్రానిక్స్ 3.46 శాతాలతో ఈ లార్జ్ క్యాప్ కంపెనీలు మార్కెట్ ను పూర్తిగా కిందికి లాగేశాయి.
