బైపోల్​లో భారీ పోలింగ్​.. ఎవరికి ఫాయిదా?

బైపోల్​లో భారీ పోలింగ్​.. ఎవరికి ఫాయిదా?
  • హుజూరాబాద్​లో 86.33% ఓటింగ్​ 
  • ఉదయం నుంచి పోటెత్తిన ఓటర్లు
  • 2018 కన్నా 1.91% ఎక్కువ
  • లెక్కలు వేసుకుంటున్న లీడర్లు 
  • గెలుపుపై ఎవరి ధీమా వాళ్లదే 
  • ఎల్లుండి ఓట్ల లెక్కింపు

హుజూరాబాద్ నుంచి ప్రత్యేక ప్రతినిధి / కరీంనగర్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికలో భారీగా పోలింగ్​ నమోదైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ సెంటర్ల  వద్ద బారులు తీరారు. శనివారం రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్​ నమోదైనట్లు సీఈవో శశాంక్​ గోయల్​ ప్రకటించారు. 2018 ఎన్నికల్లో కన్నా ఇది 1.91 శాతం ఎక్కువ. 2018లో 84.42 శాతం రికార్డయింది. కొన్ని సెంటర్లలో 8 గంటల వరకు కూడా పోలింగ్​ జరిగిందని, పోలింగ్​ శాతం మరింత పెరిగే చాన్స్​ ఉందని సీఈవో చెప్పారు. పెరిగిన పోలింగ్​ ఎవరికి ఫాయిదా కానుంది?  ఎవరిని ముంచనుంది?.. అనేదానిపై ఇప్పుడు ప్రధాన పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. 

ఏ మండలంలో.. ఏ ఊరిలో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే వివరాలు తెప్పించుకొని ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నాయి. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలతో పాటు ఐదు మండలాల్లో ఎక్కడ ఎవరికి పాజిటివ్ ఓటు పడవచ్చు అనే అంచనాల్లో రెండు ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. గెలుపు తమదంటే తమదని ఇటు బీజేపీ, అటు టీఆర్​ఎస్​ లీడర్లు ధీమా వ్యక్తం చేశారు. ఎవరు విజేత అనేది మంగళవారం తేలనుంది. పోలింగ్​ రోజు కూడా కొందరు లోకల్​ లీడర్లు ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయారు. పోలింగ్​ సెంటర్ల వద్ద హంగామా సృష్టించారు. 

ఈటల రాజేందర్​ రాజీనామాతో ఐదారునెలల నుంచి హుజూరాబాద్​ ఉప ఎన్నిక రాష్ట్రమంతటా హాట్​టాపిక్​గా మారింది. అక్కడి ఓటర్లు ఇవ్వబోయే తీర్పు కోసం పొలిటికల్​ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. బీజేపీ తరఫున ఈటల రాజేందర్​, టీఆర్​ఎస్​ తరఫున గెల్లు శ్రీనివాస్​ యాదవ్​, కాంగ్రెస్​ తరఫున బల్మూరి వెంకట్​ బరిలో నిలిచారు. కరోనా కారణంగా పోలింగ్​ సమయాన్ని ఈసీ రెండు గంటలు పెంచింది. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంట వరకు పోలింగ్​ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శనివారం గంట గంటకు ఏడు శాతం అంతకన్నా ఎక్కువ పోలింగ్​ పెరుగుతూ వచ్చింది. నియోజకవర్గంలో 2,37,022 లక్షల మంది ఓటర్లుండగా.. రాత్రి 7 గంటల వరకు 2,05,053 మంది ఓటు వేశారు. మండలాల వారీగా చూస్తే.. హుజూరాబాద్​లో 85.66, వీణవంకలో 88.84, జమ్మికుంటలో 83.68, ఇల్లందకుంటలో 90.02, కమలాపూర్​లో 87.54 శాతం పోలింగ్​ నమోదైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో మూడు, నాలుగు హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్, ఇతర వైద్య సేవలు అందించారు.  ప్రతి పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వివిధ పార్టీల కార్యకర్తలను ఆపేశారు. పోలింగ్ ప్రారంభం కాగానే ఓటు వేసి వ్యవసాయ పనులకు వెళ్లాలని అనుకున్న వాళ్లకు ఇల్లందకుంట మండలంలో ఈవీఎంల మొరాయింపుతో కొంత ఇబ్బంది ఎదురైంది. తర్వాత పోలింగ్ సిబ్బంది వాటిని సరిచేశారు. 

2010 ఉప ఎన్నిక కన్నా 15.6 శాతం ఎక్కువ
హుజూరాబాద్​ నియోజకవర్గంలో 2009 నుంచి చూస్తే ఈసారే భారీగా పోలింగ్​ నమోదైంది. 2010లో ఉప ఎన్నిక జరిగినప్పటి కంటే ఈ బై పోల్​లో దాదాపు 15.6 శాతం పోలింగ్​ పెరిగింది. 2009 ఎన్నికల్లో 71.64 శాతం, 2010 బై పోల్​లో 70.73 శాతం, 2014 ఎన్నికల్లో  77.54 శాతం, 2018 ఎన్నికల్లో 84.42 శాతం పోలింగ్​ నమోదవగా.. ఈసారి శనివారం రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం రికార్డయింది. 

ఓటేసిన అభ్యర్థులు, ప్రముఖులు
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆయన భార్య జమున కమలాపూర్ మండల కేంద్రంలో ఓటు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీణవంక మండలం హిమ్మత్ నగర్ లో ఓటు వేశారు. మాజీ మంత్రి ఇ.పెద్దిరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి హుజూరాబాద్ లో ఓటు వేశారు. టీఆర్ఎస్ నాయకుడు కౌశిక్​రెడ్డి వీణవంక మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మధ్యాహ్నం 3 తర్వాత భారీగా..
మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీగా పోలింగ్​ నమోదైంది. శనివారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మొదటి రెండు గంటల్లో 10.50 శాతం మంది ఓటు వేశారు. 11 గంటల వరకు 33.27 శాతం, మధ్యాహ్నం లంచ్ వరకు 45.63 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం  3 గంటల వరకు 61.66  శాతం, సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ నమోదైంది. రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోలింగ్ శాతం గణనీయంగా పెరగడం ఎవరికి కలిసి వస్తుందనే లెక్కలు అన్ని పార్టీలు వేసుకుంటున్నాయి. ప్రధానంగా మూడు పార్టీలు పోటీలో కనిపించినా, ఉదయం నుంచి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గానే పోలింగ్ నమోదు అవుతున్నట్టుగా ఆయా పార్టీలు లెక్కలు వేసుకున్నాయి. చివరి రెండు గంటల్లో వచ్చిన ఓటర్లంతా తమకే ఓటు వేస్తారని అధికార టీఆర్ఎస్ నేతలు బలంగా చెప్తున్నారు. ఆ ఓట్లతో తాము విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా అదే తరహా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తమకే పాజిటివ్ ఓటు నమోదైందని వారు చెప్తున్నారు. ప్రజలు ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తీరుపై బలమైన ప్రతిఘటన చూపారని వాళ్లు అంటున్నారు. 

చివరి రోజూ ఆగని పంపకాలు
ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొందరు టీఆర్ఎస్ నేతలు చివరి రోజూ పెద్ద ఎత్తున  పంపకాలకు దిగారు. పోలింగ్ సమయం ఇంకో మూడు గంటల్లో ముగుస్తుందనగా పలువురు ప్రజాప్రతినిధులు భారీగా నగదు పంచారు. అన్ని మండలాల్లో తిష్టవేసి తమ అభ్యర్థికి ఓటు వేసేలా ప్రమాణాలు చేయించుకొని డబ్బులు ఇచ్చారు. ఒక్కో ఓటరుకు రూ. 3 వేల నుంచి రూ. 10 వేల వరకు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఇలా నగదు పంపిణీ చేస్తున్న వారిని పలు చోట్ల బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. పట్టణంలోని హనుమాన్ టెంపుల్ వద్ద సిద్దిపేటకు చెందిన నాయకుడు డబ్బులు పంచుతుండగా బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ. 65 వేలు స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారులకు అప్పగించారు. మరికొంత సేపటి తర్వాత వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ లీడర్​ ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ప్రజలు అడ్డుకున్నారు. ఆయన నుంచి రూ. 49,500 స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. కరీంనగర్ కు చెందిన ఒక నాయకుడు జమ్మికుంట రోడ్డులోని నవభారత్ స్కూల్ వద్ద ఓటరు స్లిప్పులతో పాటు రూ. లక్ష నగదు పంచుతుండగా అడ్డుకున్నారు. ఆ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్ పట్టణంలోని కొత్తపల్లిలో కొందరు మహిళలకు కొందరు నేతలు డబ్బులు ఇచ్చేందుకు ప్రయత్నించగా, మీడియా అక్కడికి వెళ్లడంతో పారిపోయారు.

నవంబర్ 2న ఓట్ల లెక్కింపు
హుజూరాబాద్ బై పోల్​ ఓట్లను నవంబర్ 2న కరీంనగర్​లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో లెక్కించనున్నారు. పోలింగ్ స్టేషన్ల నుంచి శనివారం రాత్రి తెప్పించిన ఈవీఎం యూనిట్లను హుజూరాబాద్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన డీఆర్సీ సెంటర్ నుంచి  భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ కు తరలించారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రారంభించనున్నారు. ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసింది. ఇందుకు అవసరమైన టేబుళ్ల ఏర్పాటు, సిబ్బందికి ట్రైనింగ్​, మాక్ కౌంటింగ్ తదితర ప్రక్రియలన్నీ పూర్తి చేసింది.