మెదక్ జిల్లాలో రెండో విడతలో 8,260 ఇళ్లు .. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ

మెదక్ జిల్లాలో రెండో విడతలో 8,260 ఇళ్లు .. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ

మెదక్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రెండో విడతలో మెదక్ జిల్లాకు 8,260 ఇండ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ముమ్మరంగా సాగుతోంది.  పథకం అమలులో భాగంగా మొదటగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేశారు. మొదటి విడతలో జిల్లాలోని 21  మండలాల్లో ఒక్కో పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేయగా ఆయా గ్రామాల్లో 1,555 ఇళ్లు మంజూరయ్యాయి. ఆ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి మొదటి విడత రూ.లక్ష చొప్పున నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. కలెక్టర్ రాహుల్ రాజ్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాణిక్యం, సంబంధిత మండల అభివృద్ధి అధికారులు మంజూరైన అన్ని ఇళ్ల నిర్మాణాల పనులు ప్రారంభింపజేసి త్వరగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. 

మిగితా గ్రామాల్లో..

రెండో విడతలో 21 మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాలు మినహా మిగతా  గ్రామాల్లో అలాగే జిల్లాలోని 4 మున్సిపల్ పట్టణాల్లో 8,260 ఇండ్లు మంజూరయ్యాయి. రెండో విడతలో మండలాల వారీగా పాపన్నపేటకు 670 ఇండ్లు, పెద్దశంకరంపేటకు 530, చేగుంటకు 509,  చిన్న శంకరంపేటకు 471, హవేలీ ఘనపూర్ కు 462, టేక్మాల్ కు 430,  అల్లాదుర్గానికు 400, శివ్వంపేటకు 384, కొల్చారం 316, నర్సాపూర్ కు 314, మెదక్ కు 312, కౌడిపల్లికి 311,  నిజాంపేటకు  304, రామాయంపేటకు 286, వెల్దుర్తికి 286, రేగోడ్ కు 280, తూప్రాన్ 223, చిలప్ చెడ్ కు 174, మాసాయిపేటకు 161, నార్సింగికి 77, మనోహరాబాద్ కు 107  ఇండ్లు మంజూరయ్యాయి.

మంజూరు పత్రాల పంపిణీ..

రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఇటీవల మెదక్ నియోజకవర్గ పరిధిలోని పాపన్నపేట, హవేలీ ఘనపూర్, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో ఎమ్మెల్యే రోహిత్ రావు చేతుల మీదుగా ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

వెంటనే నిర్మాణం చేపట్టేలా చర్యలు

మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రెండో విడతలో ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందిస్తున్నాం. వారు వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ గైడ్ లైన్ ప్రకారం ఇళ్లు నిర్మించుకునేలా, వేగండగా పూర్తి చేసేలా చూస్తాం.  - మాణిక్యం, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్