ఆ అవార్డును తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు: ఏఎన్నార్ శత జయంతి వేడుకలో చిరంజీవి

ఆ అవార్డును తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు: ఏఎన్నార్ శత జయంతి వేడుకలో చిరంజీవి

అక్కినేని నాగేశ్వరరావు  శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ ఏడాది ఏఎన్‌‌ఆర్ ఇంటర్నేషనల్ అవార్డు చిరంజీవి అందుకున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్  ఈ అవార్డును ప్రదానం చేశారు. ‘‘కొడుకులైనంత మాత్రాన నా వారసులు కాలేరు..  ఎవరైతే నా వారసులు అవుతారో వారే నా కొడుకులు అవుతారు” అంటూ తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన కవితను ప్రస్తావించిన అమితాబ్ బచ్చన్.. ఏఎన్‌‌ఆర్‌‌‌‌ విషయంలో నాగార్జున,  ఆయన కుటుంబ సభ్యులు దీన్ని నిరూపించారని ప్రశంసించారు.  తనపై చూపించిన ప్రేమ,  స్నేహం, ఆతిథ్యం విషయాల్లో చిరంజీవికి ఆయన ధన్యవాదాలు చెప్పారు.  

‘నాగార్జున,  చిరంజీవి, దర్శకుడు నాగ్ అశ్విన్ కారణంగా తెలుగు చిత్రాల్లో నటించాను.  ఇప్పుడు నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సభ్యుడినని గర్వంగా చెప్తాను. ఇకపై కూడా మీ సినిమాల విషయంలో నన్ను గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా’ అని అమితాబ్ చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ ‘నాకు ఎప్పుడు ఏ మంచి జరిగినా, ఏ అవార్డు వచ్చినా అమితాబ్‌‌ గారి నుంచే మొదటి శుభాకాంక్షలు వస్తాయి. ఆయనలాంటి బిగ్ స్టార్ నాకు ఈ అవార్డును అందజేయడం ఆనందంగా ఉంది. 

ఇక ‘తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది’. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను అని అనిపిస్తుంది. నా ఇల్లు అనుకునే సినీ పరిశ్రమలో టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో జరిగిన కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆ అవార్డును తీసుకోవడం కరెక్ట్ అనిపించలేదు. నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడే తీసుకుంటానని చెప్పా. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు అమితాబ్ గారి చేతులమీదుగా  ఏఎన్‌‌ఆర్ అవార్డు తీసుకోవడంతో .. నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను అనిపిస్తుంది. నా వాళ్లు నన్ను గుర్తించి.. నా ఇంట ఇలాంటి అవార్డులు, ప్రశంసలు వచ్చిన రోజున అది  నిజమైన అచీవ్‌‌మెంట్ అని భావించాను. అది ఈరోజు మనస్ఫూర్తిగా అనుభవిస్తున్నా.

పద్మ భూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్‌‌ బుక్‌‌ రికార్డ్ లాంటివి ఎన్ని వచ్చినా.. నా వాళ్లు నన్ను గుర్తించి అవార్డు ఇస్తుండడం గొప్ప విషయంగా అనిపించింది’ అని అన్నారు. నాగార్జున మాట్లాడుతూ ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం చిరంజీవి గారిది. ఇదే స్టూడియోలో కొన్నాళ్ల క్రితం అమితాబ్‌‌ బచ్చన్‌‌ గారికి ఈ అవార్డు ఇచ్చాం. ఇప్పుడు చిరంజీవి గారికి ఈ అవార్డు ఇవ్వడం మాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు.  ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు హీరోలు వెంకటేష్, రామ్ చరణ్, నాని, దర్శకులు రాఘవేంద్రరావు, నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్,  సుబ్బిరామిరెడ్డి  సహా పలువురు  సినీ సెలబ్రిటీలు పాల్గొన్నారు.