హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్2 ప్రాజెక్టుకు సకాలంలో అనుమతులు రావడం అత్యంత కీలకమని, సంబంధిత స్టేక్ హోల్డర్ శాఖలన్ని వెంటనే ఎన్వోసీలు జారీ చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (ఎంఏయూడీ) స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ కోరారు. కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు పొందడానికి, ప్రాజెక్టు ఎలాంటి ఆలస్యం లేకుండా ముందుకు సాగడానికి ఈ అనుమతులు తప్పనిసరని స్పష్టం చేశారు. ఫేజ్-2లోని 7 కారిడార్ల ప్రభావ పరిధిలో ప్రాజెక్టులు ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో మంగళవారం సెక్రటేరియట్‌లో జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన సమన్వయ సమావేశం జరిగింది.
కేంద్రం పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) - నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ నుంచి ప్రాజెక్టుకు క్లియరెన్స్ పొందే ప్రక్రియలో భాగంగా ఈ భేటీ నిర్వహించారు. 122.9 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన 7 కారిడార్ల అలైన్‌మెంట్ వివరాలను సమావేశంలో ప్రదర్శించారు. ఎన్‌హెచ్ఏఐ, మోర్త్ (మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్), డిఫెన్స్, జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, ఆర్‌అండ్‌బీ విభాగాలతో రైట్ ఆఫ్ వే పంచుకోవడంపై చర్చించారు. రైల్వే క్రాసింగ్‌లు, నాగోల్ వద్ద మూసీ నదితో పాటు ఇతర జలాశయాల మీదుగా వెళ్లే మార్గాలు, గ్యాస్ పైప్ లైన్లు, ఎయిర్‌పోర్ట్ సరిహద్దు పరిధిలోని నిర్మాణ అనుమతులపై చర్చించారు.
