ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.5,000 పోగొట్టుకుంది. అయితే ఆమె ముందుచూపు వల్ల ఎక్కువగా నష్టం జరగకుండా ప్రమాదం తప్పింది.
ఈ ఘటన ఎలా జరిగిందంటే... రీనా పాటిల్ అనే మహిళకు మహానగర్ గ్యాస్ (MGL) పేరుతో ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మీరు గత నెల బిల్లు కట్టలేదు, ఈరోజు రాత్రి నుండి మీ గ్యాస్ కనెక్షన్ కట్ అవుతుంది అని అందులో ఉంది. గ్యాస్ కనెక్షన్ కట్ అవుతుందనే భయంతో ఆమె ఆ మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసింది. అప్పుడు ఓ వ్యక్తి అతని పేరు రాహుల్ కుమార్ అని చెబుతూ... అతను గ్యాస్ ఏజెంట్ అంటూ ఆమెని నమ్మించాడు.
తరువాత గ్యాస్ బిల్లు అప్‌డేట్ చేయడానికి ఒక యాప్ లింక్ పంపి, దానిని డౌన్లోడ్ చేసుకోమన్నాడు. ఈ యాప్ ఆమెకు తెలియకుండానే ఆమె ఫోన్ స్క్రీన్‌ను అతనికి కనిపించేలా చేసే 'స్క్రీన్ షేరింగ్' యాప్. యాప్ డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసాక... ఆమె డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేయగానే, ఆమె అకౌంట్ నుండి 5 వేలు కట్ అయ్యాయి.
రీనా డెబిట్ కార్డు డైలీ లిమిట్ రూ.5,000 మాత్రమే సెట్ చేయడంతో మోసగాడు అంతకంటే ఎక్కువ డబ్బులు తీయలేకపోయాడు. అదే టైంలో మరో వ్యక్తికి కూడా ఆ యాప్ లింక్ పంపగా, అతను ఐఫోన్ వాడుతుండటం వల్ల ఆ నకిలీ యాప్ ఇన్‌స్టాల్ కాలేదు. బాధితురాలైన రీనా పాటిల్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో దీనిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు.
నకిలీ లింకులు, APK డౌన్‌లోడ్‌లు, వాట్సాప్ లేదా SMS మెసేజుల పట్ల మహానగర్ గ్యాస్ కస్టమర్లను హెచ్చరించింది. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజెస్ వస్తే అది నిజమో కాదో ముందుగా తెలుసుకోవాలని కంపెనీ చెప్పింది.
మహానగర్ గ్యాస్, కాల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా OTPలు, బ్యాంక్ వివరాలు లేదా పాస్‌వర్డ్‌లను అడగదని స్పష్టం చేసింది. వినియోగదారులు కంపెనీ వెరిఫైడ్ వాట్సాప్ నంబర్ ద్వారా మాత్రమే సంప్రదించాలని సూచించింది. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే తెలియజేయాలని కూడా వినియోగదారులను కోరింది.
