వనపర్తి/వీపనగండ్ల, వెలుగు: ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అన్ని పథకాల అభివృద్ధి కోసం మహిళల చేతులకే ప్రగతి రథచక్రాలు ఇస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చిన్నంబావి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను మంత్రి బుధవారం ప్రారంభించారు. బస్సును కొద్దిదూరం నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ తర్వాత గోపల్దిన్నెలో రూ.2.23కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ను ప్రారంభించారు.
గ్రామ శివారులో సర్వేనెంబర్ 353 గల భూమిని అర్హులైన పేదలకు అందించాలని వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్య నాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యాని ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి హాజరయ్యారు. వీపనగండ్ల ప్రభుత్వ ఆస్పపత్రిలో రూ.16.50లక్షలతో ఏర్పాటు చేసిన ఎక్స్ రే సెంటర్ ను ప్రారంభించారు. కేజీబీవీలో నాబార్డ్ నిధులు రూ.42 లక్షలతో నిర్మించే రెండు రూముల నిర్మాణానికి భూమి పూజ చేశారు. గోపల్ దీన్నె రంగవరం సబ్ స్టేషన్ శిలాఫలకంపై రంగవరం సర్పంచ్ శివ పేరు లేకపోవడంపై విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ యాదవ్, పీఏసీ చైర్మన్ నరసింహారెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
