ముషీరాబాద్, వెలుగు: 20 రోజులుగా జాడలేని అంకం రాహుల్ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో అతని తల్లిదండ్రులు నిరసన దీక్షకు దిగారు. తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని సమితి కేంద్ర కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ మీడియాతో మాట్లాడారు. రాహుల్ మృతిపై ఇప్పటికీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విప్పడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమన్నారు.
రాజకీయం కోసం తెలంగాణకు వస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ రాష్ట్రంలోని సింగరాయకొండలో చిక్కుకున్న రాహుల్ కుటుంబ సభ్యులకు పరామర్శించకపోవడం ఆయన విచక్షణకు నిదర్శనమన్నారు. సంఘటన జరిగి 20 రోజులు గడుస్తున్నా.. దోషులను పోలీస్ శాఖ గుర్తించలేదన్నారు. త్వరలోనే ఈ విషయంపై తెలంగాణ డీజీపీ, మానవ హక్కుల కమిషన్, తెలంగాణ, ఏపీ హైకోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు. న్యాయం జరిగే వరకు ప్రతిరోజు దీక్ష కొనసాగుతుందని తల్లిదండ్రులు అంకం రాజేశ్వర్, అంకం వనిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లంపల్లి రామకోటి, బోనం ఊర్మిళ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
