జనగామ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధాన రహదారులు రక్తమోడుతున్నాయి. తాజాగా జనగామ - సూర్యాపేట ప్రధాన రహదారిపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు
వివరాల్లోకి వెళితే.. రహదారిపై వెళ్తున్న ఒక బొలెరో వాహనం అకస్మాత్తుగా పంక్చర్ అయ్యింది. దీంతో డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని పక్కకు ఆపి పంక్చర్ వేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో.. వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన ఒక ఇసుక లారీ, ఆ బొలెరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ వేగానికి పంక్చర్ చేస్తున్న ముగ్గురు వ్యక్తులు లారీ కింద పడి నలిగిపోయి, అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఈ ప్రమాదంలో మరణించిన వారిని.. దంతాలపల్లి మండలం బెస్టెట్టిపల్లి గ్రామానికి చెందిన రాజేందర్ (26 సంవత్సరాలు), గుండాల మండలం బండా కొత్తపల్లి గ్రామానికి చెందిన మహేష్ (21 సంవత్సరాలు)తో పాటు రాజస్థాన్‌కు చెందిన రోహిత్‌గా పోలీసులు గుర్తించారు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం కన్నీరు మున్నీరుగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. జనగామ - సూర్యాపేట రహదారిపై తరచూ జరుగుతున్న ప్రమాదాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిరిసిల్లలో ఒకరు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సిరిసిల్ల బైపాస్ రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీ కొట్టింది. ఈ ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి గాయాలయ్యాయి.గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
