నస్పూర్, వెలుగు: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ–2005) అమలులో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు సమాచారాన్ని పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. ఆర్‌టీఐ చట్టం ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే కీలక సాధనమని చెప్పారు.
చట్టం ప్రకారం 30 రోజుల్లోగా సమాచారం అందించాలని, గడువు దాటితే ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రథమ అప్పీళ్ల అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులకు చట్టంలోని నిబంధనలు, దరఖాస్తుల పరిష్కారం, అప్పీళ్ల నిర్వహణపై అవగాహన కల్పించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, కమిషన్ సూచనలను అధికారులు తప్పనిసరిగా అమలు చేసి ప్రజలకు సత్వర సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం పెండింగ్ అప్పీళ్లను శాఖల వారీగా సమీక్షించారు.
