కుంటాల మండలంలోని మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ తనిఖీ...అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం

కుంటాల మండలంలోని మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్ తనిఖీ...అపరిశుభ్ర వాతావరణంపై ఆగ్రహం

కుంటాల, వెలుగు: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌ను బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభమై మూడు రోజులు గడిచినా కేవలం 33 మంది విద్యార్థులు మాత్రమే హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత సరిగా లేకపోవడం, పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంపై సిబ్బంది పనితీరును తప్పుబట్టారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. 

విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఈవోను ఆదేశించారు. అనంతరం స్థానిక పీహెచ్‌‌‌‌‌‌‌‌సీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. తర్వాత అందకూర్ గ్రామంలో పూర్వ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచులు జక్కుల గజేందర్, ప్రవళి, తహసీల్దార్ కమల్‌‌‌‌‌‌‌‌సింగ్, ఎంపీడీవో వనజ, ఎంఈవో ముత్యం పాల్గొన్నారు.