గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం..రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో గుడిసె వాసులకే ప్రాధాన్యత: మంత్రి పొంగులేటి

గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం..రెండో విడత ఇందిరమ్మ ఇండ్లలో గుడిసె వాసులకే ప్రాధాన్యత: మంత్రి పొంగులేటి
  • క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలి  
  • రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్టు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో ఉంటున్న వారికే ప్రాధాన్యత ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో జీవించకుండా సొంత ఇంటిలో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలు, గుడిసెల గుర్తింపు, రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకం, అసంపూర్తి గృహాల వివరాల సేకరణ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

రాష్ట్రం లోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధి లో ఉన్న గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారుల ను మంత్రి ఆదేశించారు.“ప్రభుత్వం దగ్గర ఇప్పటికే ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలి. ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలి.

ఎంపీడీవో స్థాయిలో జాబితాలను సిద్ధం చేసి సంబంధిత ఇన్‌చార్జి మంత్రుల ఆమోదానికి పంపించాలి. సర్వే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. అర్హుల ఎంపికలో కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా ఎటువంటి పొరపాట్లు, వివక్షకు తావు లేకుండా అనర్హుల పేర్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలి” అని మంత్రి పొంగులేటి ఆదేశించారు. రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 ఇండ్ల చొప్పున మంజూరు చేసిన నేపథ్యంలో అర్హుల ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకానికి ప్రాధాన్యత

పేదల నివాస భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రెండో విడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 ఇండ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇండ్లను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గోడలు, పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులు టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్లు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పైకప్పుల కింద నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి ఆర్‌సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.

అసంపూర్తి ఇండ్లకు కూడా అవకాశం 

గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇండ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. పాత ఇందిరమ్మ పథకం కింద మంజూరై బేస్మెంట్ స్థాయి లేదా పైకప్పు స్థాయిలో నిలిచిపోయిన ఇళ్లను కూడా ఈ పథకంలో చేర్చవచ్చని పేర్కొన్నారు.అలాగే గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహాలను కూడా గుర్తించి రూఫ్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమం ద్వారా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఎల్‌సీ (బెనిఫిషియరీ లెడ్ కన్స్‌ట్రక్షన్) విధానంలో లబ్ధిదారుడే తన ఇంటిని నిర్మించుకొనే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని చిన్న స్థలాలు కలిగిన లబ్ధిదారులకు అవసరాన్ని బట్టి గ్రౌండ్ ప్లస్ వన్ (జి+1) నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వవచ్చని పేర్కొన్నారు.

సవాల్ స్వీకరించకుండా కేటీఆర్ అబద్ధాలు

 ఇందిరమ్మ ఇండ్లపై తన సవాల్​ను స్వీకరించకుండా కేటీఆర్ అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్‌లో అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తు న్నారని మంత్రి ఫైరయ్యారు. బుధవారం పాలేరులో నిర్వహించిన బీఎల్​వోల మీటింగ్ లో కేటీఆర్  పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు.పదేండ్లు అధికారంలో ఉండి పేదలకు ఎన్ని డబు ల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇచ్చారో చెప్పలేని కేటీఆర్.. రెండున్నరేండ్లలో లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పమన్నారు.