గుడిహత్నూర్, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గ్రామాల ఆదివాసుల మధ్య అటవీశాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా చిచ్చుపెడుతున్నారని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆరోపించారు. వ్యవసాయ భూముల హద్దుల వివాదంలో గిరిజనులు, ముఖ్యంగా మహిళలపై దాడులకు పాల్పడిన అటవీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఐటీడీఏ పీవో మంద మకరందుకు వినతిపత్రం అందజేశారు. గత 30 ఏళ్లుగా సాగు చేస్తున్న భూముల విషయంలో అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దాదాపు 20 మంది ఆదివాసులను అరెస్టు చేసి వారి కుటుంబాలకు సమాచారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. సమస్యపై అటవీ అధికారులతో మాట్లాడి గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చారు.
