బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు పంచుతం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

బీఆర్ఎస్ కబ్జా చేసిన భూములను తిరిగి పేదలకు పంచుతం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • నాడు వాళ్ల భూములను లాక్కున్నరు
  • ధరణి ఇబ్బందుల పరిష్కారానికే భూభారతి తెచ్చినం 
  • హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే సాదాబైనామాల పరిష్కారం
  • ఈ నెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మఇండ్లు ప్రారంభిస్తామని వెల్లడి
  • భూదందాల కోసమే నాడు ధరణి తెచ్చారు: వివేక్ వెంకటస్వామి 
  • ఎలాంటి అక్రమాలకు తావులేకుండా భూభారతి తెచ్చామని వెల్లడి 
  • మంచిర్యాలలోని భీమారంలో భూభారతిపై సదస్సు

కోల్‌‌బెల్ట్ / జైపూర్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పేదల భూములను కబ్జా చేశారని, వాటిని తిరిగి పేదలకు పంచుతామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ధరణి వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించేందుకే భూభారతి తెచ్చామని చెప్పారు. ‘‘బీఆర్ఎస్​ తెచ్చిన ధరణితో లక్షలాది మంది పేదలకు అన్యాయం జరిగింది. రైతులు ఆఫీసులు,అధికారుల చుట్టూ తిరిగినా వాళ్ల భూసమస్యలు పరిష్కారం కాలేదు. ఇప్పుడు మేం తెచ్చిన భూభారతి చట్టంతో భూసమస్యలన్నీ పరిష్కారమవుతాయి. 

నాలుగు జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని చట్టాన్ని అమలు చేస్తున్నాం. రెవెన్యూ ఆఫీసర్లే గ్రామానికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నారు. మరో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని పైలట్​ప్రాజెక్టుగా తీసుకొని భూభారతి అమలు చేస్తాం. జూన్ 2 నుంచి అన్ని రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తాం” అని వెల్లడించారు.  ధరణికి సంబంధించి 92 వేల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌‌లో ఉన్నాయని, హైకోర్టు నుంచి క్లియరెన్స్ రాగానే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. భీమారం మండలంలో 2,200 భూసమస్యలు రాగా, అందులో 1,100 సాదాబైనామాకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘మంచిర్యాల జిల్లాలో అటవీ భూముల సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌‌‌‌ను ఆదేశించాను. నియోజకవర్గంలో కొందరు ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెప్పారు. 

వెంటనే సర్వే నిర్వహించి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం” అని చెప్పారు. ఆధార్ కార్డు తరహాలో భూధార్ కార్డును తీసుకొస్తున్నామన్నారు. మొత్తం 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని, ఈ నెలాఖరులోగా 4 లక్షల ఇండ్లు ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ కోరిక మేరకు వారి నియోజకవర్గాలకు మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రావాల్సిఉండగా, మరో మీటింగ్​ఉండడం వల్ల రాలేకపోయారని చెప్పారు. కాగా, జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ హెలిప్యాడ్ వద్ద మంత్రి శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. సదస్సులో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​రావు, కలెక్టర్​ కుమార్ దీపక్​ పాల్గొన్నారు. 

బీఆర్ఎస్​ హయాంలో భూదందాలు:​ వివేక్  

భూదందాలు చేసేందుకే మాజీ సీఎం కేసీఆర్​ధరణి చట్టాన్ని తెచ్చారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి అన్నారు. బీఆర్ఎస్​లీడర్లు కావాలనే కొన్న భూములను ప్రొహిబిటెడ్​లిస్టులో పెట్టి దందాలు చేశారని, కబ్జా కాలాన్ని తీసేసి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా తాను ఎక్కడికెళ్లినా భూముల సమస్యలే చెప్తున్నారన్నారు. ఎలాంటి అక్రమాలు జరగడానికి వీల్లేకుండా భూభారతి చట్టాన్ని తెచ్చామని చెప్పారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. ‘‘బీఆర్ఎస్​ ప్రభుత్వం డబుల్ బెడ్‌‌రూమ్ ఇండ్లు ఇస్తామని ప్రజలను మోసం చేసింది. కానీ మేం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కువ మంజూరు చేయాలని మంత్రిని కోరాం” అని తెలిపారు. సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తున్నామని, యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి కోసం ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.