
బీజే ఎల్పీ నేత ఏలేటికి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
హైదరాబాద్, వెలుగు: బీజేపీ సభ్యులు మూసీకి వ్యతిరేకమా, అనుకూలమా చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు. బాపూ ఘాట్ వద్ద ఈసా, మూసీ నదుల సంగమం చోట గాంధీ స్మృతి వనం కట్టి దేశంలోనే గొప్పగా బాపూ ఘాట్ అభివృద్ధి చేసుకోవాలనేది సీఎం రేవంత్రెడ్డి ఆలోచనని.. దీంతో ఆ ప్రాంతమంతా అభివృద్ధి చేసుకోవచ్చు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందన్నారు.
అహ్మదాబాద్లో సబర్మతీ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చినట్టు మూసీకి కేంద్రం నిధులు ఇస్తారా? ఇవ్వరా? కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్పాలి. మీ మేనిఫెస్టోలో మూసీ ప్రక్షాళన ఉంది, దానికి నిధులు ఎందుకు కేటాయించ లేదని ప్రశ్నించారు. మూసీ అభివృద్ధి తెలంగాణలో అంతర్భాగం కాదా.. అనేక రాష్ట్రాల్లో కాలువల, నదుల అభివృద్ధికి నిధులు ఇస్తున్నారు.. గాంధీ స్మృతి వననాకి నిధులు ఇస్తారా? లేదా? తెలంగాణ ప్రజలకు చెప్పాలని పొన్నం ప్రశ్నించారు.