నిరసనలకు దిగితే మరణశిక్షే..ప్రజలకు ఇరాన్ అటార్నీ జనరల్ వార్నింగ్

నిరసనలకు దిగితే మరణశిక్షే..ప్రజలకు ఇరాన్ అటార్నీ జనరల్ వార్నింగ్
  •  ఆందోళనకారులను దేవుడి శత్రువుగా పరిగణిస్తాం
  • రెండో వారంలోకి ఆందోళనలు.. 65 మంది మృతి  
  • మదురో లెక్కనే ట్రంప్​నూ పట్టి తేవాలన్న ఇరాన్​ నేత

టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్​లో నిరసనకారులపై ఆ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెదీ ఆజాద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనలకు దిగుతున్న వారిని దేవుడికి శత్రువులుగా పరిగణిస్తామని, వారికి మరణశిక్ష విధిస్తామని ఆయన హెచ్చరించారు. శనివారం ఈ మేరకు ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు ప్రభుత్వ టీవీ చానెల్ ఓ వార్తను ప్రసారం చేసింది. 

దేశవ్యాప్తంగా నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయాలని రెవెల్యూషనరీ గార్డ్స్ బలగాలకు సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. స్కూళ్లు, యూనివర్సిటీలు ఆన్ లైన్​లోనే క్లాసులు నిర్వహిస్తున్నాయని పేర్కొంది. కాగా, ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్ అంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

 శనివారం నాటికి నిరసనలు రెండో వారంలోకి ప్రవేశించాయి. దేశ కరెన్సీ రియాల్ దారుణంగా పతనం కావడం, ధరలు విపరీతంగా పెరగడం, ఖమేనీ నిర్బంధ పాలనకు వ్యతిరేకంగా శనివారం కూడా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి, ర్యాలీలు తీశారు. 

ఖమేనీ ఫొటోలకు నిప్పు అంటిస్తూ, ఆ నిప్పుతో సిగరెట్ వెలిగించుకుంటున్న ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కాగా, ఇరాన్ లోని అన్ని సిటీల్లో చౌరస్తాలను స్వాధీనంలోకి తీసుకోవాలని నిరసనకారులకు అమెరికాలో ప్రవాసంలో ఉన్న క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లావీ పిలుపునిచ్చారు. 

65 మంది మృతి.. 2,300 మంది అరెస్ట్ 

ఇరాన్​లో గత రెండు వారాల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటివరకూ 65 మంది నిరసనకారులు చనిపోయారని, సుమారు 2,300 మందిని అరెస్ట్ చేశారని అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టుల న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా, ఇరాన్​లో ధైర్యంగా నిరసనలు తెలుపుతున్న ప్రజలకు అమెరికా మద్దతుగా ఉంటుందని యూఎస్​ మంత్రి మార్కో రూబియో శనివారం ట్వీట్ చేశారు. 

ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదు

ఇరాన్​లో నిరసనకారులను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రెచ్చగొడుతున్నారని ఇరాన్ కల్చరల్ రెవల్యరూషన్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు హసన్ రహీంపౌర్ అజ్ఘాదీ ఫైర్ అయ్యారు. నిరసనకారులను కాల్చి చంపితే ఊరుకోబోమంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలపై హసన్ తీవ్రంగా స్పందించారు. ‘‘ఇటీవల వెనెజువెలా ప్రెసిడెంట్ మదురోను అమెరికా బలగాలు బంధించి తీసుకెళ్లాయి. ఇరాన్​లో నిరసనలను రెచ్చగొడుతున్న ట్రంప్​ను కూడా ఇరాన్ బలగాలు వెళ్లి బంధించి తేవాలి” అని ఆయన కామెంట్ చేశారు.