జనవరి 12న పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ ప్రయోగం..తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు

జనవరి 12న పీఎస్ఎల్వీ సీ62 రాకెట్ ప్రయోగం..తిరుమలలో ఇస్రో చైర్మన్ పూజలు
  • తిరుమలలో ఇస్రో చైర్మన్ నారాయణన్ పూజలు

న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కొత్త ఏడాదిలో మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతున్నది. జనవరి 12న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్(ఈవోఎస్–ఎన్1)ను అంతరిక్షంలోకి పంపనుంది. ఉదయం 10:17 గంటలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తో పాటు మొత్తం 14 కో-ప్యాసెంజర్ పేలోడ్‌‌లను నింగిలోకి పంపనున్నారు. 

ఇందులో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ఈవోఎస్–ఎన్1(అన్వేష్) ప్రధాన పేలోడ్‌‌. ఇది మన దేశంలోని వ్యవసాయం, సిటీ మ్యాపింగ్, పర్యావరణ పర్యవేక్షణ, బార్డర్లలో వ్యూహాత్మక నిఘా వంటి రంగాల్లో సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది. దీనికితోడు ఈ మిషన్‌‌లో భారతీయ స్టార్టప్‌‌లు, అకాడమిక్  సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చేసిన ఆయుల్ శాట్, ఎంవోఐ-1, కీస్ట్రెల్ ఇనీషియల్ డెమోన్ స్ట్రేటర్(కిడ్) వంటి ఆసక్తికరమైన 14 కో-ప్యాసెంజర్ పేలోడ్‌‌లు కూడా ఉన్నాయి. 

ఈ మిషన్ సుమారు 2 గంటల పాటు కొనసాగనుంది. ఈవోఎస్–ఎన్1 శాటిలైట్ లిఫ్ట్ -ఆఫ్ తర్వాత 17 నిమిషాల్లో  భూమికి 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్-సింక్రోనస్ ఆర్బిట్‌‌లోకి ప్రవేశించనుంది. ఈ మిషన్ కోసం 25 గంటల కౌంట్‌‌డౌన్ 11వ తేదీన ప్రారంభం కానుంది.

తిరుమలలో పూజలు

ఇస్రో చైర్మన్ నారాయణన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల 12న పీఎస్ఎల్వీ -సీ62  రాకెట్​ ప్రయోగం నేపథ్యంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని  ప్రార్థించారు.