వాట్సాప్ వెబ్ నుంచే వాయిస్, వీడియో కాల్స్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. డైరెక్ట్‌గా బ్రౌజర్ నుంచే కాల్ చేసే అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం ఇది వాట్సాప్ వెబ్ బీటా టెస్టింగ్‌లో ఉంది. మొదటి దశలో ఒన్ టు ఒన్ చాట్స్‌లో మాత్రమే కాలింగ్ సపోర్ట్ అందిస్తున్నారు. దీన్ని వాడాలంటే అర్హత ఉన్న కస్టమర్స్ వ్యక్తిగత చాట్‌లోకి వెళ్లి అక్కడ కనిపించే వాయిస్ లేదా వీడియో కాల్ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. కాల్స్ పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో సేఫ్‌గా జరుగుతాయని వాట్సాప్ తెలిపింది.
ఈ అప్డేట్ ముఖ్యంగా లైనక్స్ యూజర్లకు ఉపయోగపడనుంది. ఎందుకంటే ఇప్పటివరకు లైనక్స్ కోసం వాట్సాప్ వెబ్‌నే వాడుతున్నారు. ఇప్పుడు బ్రౌజర్ నుంచే కాల్స్ చేయొచ్చు. అంతేకాదు.. వాట్సాప్ వెబ్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ షేరింగ్ ఫీచర్‌ను కూడా వాడొచ్చు. దీని ద్వారా కస్టమర్స్ వీడియో కాల్ సమయంలో తమ స్క్రీన్‌లోని కంటెంట్‌ను రియల్ టైంలో షేర్ చేసుకోవచ్చు.
ఇవే కాకుండా త్వరలోనే వాట్సాప్ వెబ్‌లో గ్రూప్ కాలింగ్ చేసేందుకు కూడా మరో ఫీచర్‌ను డెవలప్ చేయనుంది. ఆ గ్రూప్ కాల్లో 32 మంది వరకు పాల్గొనొచ్చు. అలాగే కాల్ లింక్స్, షెడ్యూల్డ్ కాల్స్ వంటివి కూడా అందుబాటులోకి రానున్నాయి.
