- గవర్నమెంట్ ఎంప్లాయ్ విజ్ఞప్తిని పరిగణించండి
- కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్ లివ్ ఇన్ పార్ట్ నర్ కు పింఛను ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తన లివ్ ఇన్ పార్ట్ నర్, తమ పిల్లల పేర్లను కూడా కుటుంబ పింఛనులో చేర్చాలంటూ దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. రిటైర్డ్ ఎంప్లాయ్ తన సంబంధాన్ని ఎప్పుడు దాచలేదని, అతడి పార్ట్ నర్, పిల్లలను కుటుంబంగా పరిగణించాలని చేసిన ప్రయత్నాలను తప్పుగా పరిగణించి పోస్ట్ రిటైర్ మెంట్ బెనిఫిట్స్ నిరాకరించడం తప్పు అని జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ మధు జైన్ తో కూడిన బెంచ్ ఇటీవల తీర్పును వెలువరించింది.
పిటిషనర్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని బకాయిపడిన తేదీ నుంచి ఏడాదికి 6% వడ్డీతో కలిపి ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్‌కు 40 ఏండ్ల క్రితం ఒక మహిళతో పెండ్లైంది. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. అనంతరం అతడిని విడిచిపెట్టి ఆమె వెళ్లిపోయింది. చట్టబద్ధంగా విడాకులు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మరొక మహిళతో 1983లో లివ్ ఇన్ రిలేషన్ షిప్ ప్రారంభించారు.
వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. తన భార్య, కుమార్తెను నిర్లక్ష్యం చేస్తూ మరొక మహిళతో కలిసి ఉన్నారంటూ1990లో పిటిషనర్ డిపార్ట్ మెంటల్ ఎంక్తైరీని ఎదుర్కొన్నారు. దీంతో అతడికి నాలుగేండ్ల పాటు జీతంలో కోతపడింది. తన పార్ట్ నర్, పిల్లలకు సంబంధించిన డిప్లొమాటిక్ పాస్‌పోర్టుల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని 2011లో మరోసారి విచారణ జరిగింది. నెలవారీ పెన్షన్, గ్రాట్యూటీ ప్రయోజనాల్లో 50% కోత పడింది. దీంతో తన లివ్ ఇన్ పార్ట్నర్కు పింఛను ఇచ్చేలా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
“పిటిషనర్ తన లివ్ ఇన్ పార్ట్నర్షిప్ బంధాన్ని ఎన్నడు దాచిపెట్టలేదు. సర్వీసు రికార్డుల్లో ఆ బంధం గురించి వెల్లడించి ఫ్యామిలీ బెనిఫిట్స్ కోసం ప్రయత్నించారు. పిటిషనర్ తన బంధం గురించి పారదర్శకంగానే వెల్లడిస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌ను మోసం చేసి డిప్లొమాటిక్ పాస్‌పోర్టులను పొందాలనే దురుద్దేశం కనిపించడం లేదు. అందుకు సంబంధించి రికార్డులు స్పష్టంగా ఉన్నాయి’’ అని కోర్టు పేర్కొంది. అలాగే పిటిషనర్ లివ్ ఇన్ పార్ట్నర్, పిల్లలను కుటుంబ పింఛనులో చేర్చాలంటూ చేసిన అభ్యర్థనను పరిశీలించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేసింది.
