వెలుగు ఓపెన్ పేజీ..పేదోళ్ల నాయకుడు పీజేఆర్

వెలుగు ఓపెన్ పేజీ..పేదోళ్ల నాయకుడు పీజేఆర్

 పబ్బతిరెడ్డి జనార్దన్ రెడ్డి  అలియాస్  పీజేఆర్  హైదరాబాద్  నగర చరిత్రలో  మూడు దశాబ్దాలపాటు యువజన కాంగ్రెస్ నాయకునిగా, కార్మిక నాయకునిగా  సేవలందించారు.  ఐదుసార్లు శాసనసభ్యుడిగా, రెండు పర్యాయాలు మంత్రిగా,  శాసన సభాపక్ష  నాయకునిగా ప్రజలకు సేవలందించారు.  యువతరాన్ని రాజకీయ రంగంలోకి తీసుకువచ్చి ఎందరికో రాజకీయ అవకాశాలు కల్పించిన మహానేత  పీజేఆర్.  కార్మికుల కష్టాల్లో,  రోడ్డుపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల పాలిట అన్నగా,  పిలిస్తే పలికే నేతగా పేదోళ్ల దేవునిగా పేరుపొందాడు పీజేఆర్.


హై దరాబాద్​ లోయర్ ట్యాంక్​బండ్​లోని     దోమలగూడలో  నివాసం ఉన్న సాధారణ కుటుంబమైన పబ్బతిరెడ్డి పాపిరెడ్డి,  శివమ్మలకు  జనవరి 12. 1948న  పి జనార్దన్ రెడ్డి  జన్మించారు. 12 జనవరి 2026  ఆయన 77వ జయంతి జరగనుంది.  చాదర్ ఘాట్​లోని   హైస్కూల్లో  ఎస్.ఎస్.ఎల్.సి   వరకు  చదువుకున్న  ఆయన మాసాబ్​ట్యాంక్​లోని   ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువులు పూర్తి చేశారు.   పీజేఆర్​కు  భార్య  సులోచన,   ముగ్గురు కుమార్తెలు,  ఒక  కుమారుడు ఉన్నారు. కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి  రెండు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైనారు. కుమార్తె విజయారెడ్డి ప్రస్తుతం  ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్​గా ఉన్నారు.  మరో ఇద్దరు కుమార్తెలు  పావని రెడ్డి, గాయత్రి రెడ్డి.

 కార్మిక నాయకుడిగా ...

 పాలిటెక్నిక్  పూర్తయిన  తర్వాత సనత్​నగర్​లోని  పారిశ్రామిక వాడలో  ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విద్యుత్ శాఖలో విధులు  నిర్వహిస్తూ  అక్కడే  కార్మిక  నాయకునిగా ఎదిగారు.  అదే సమయంలో పారిశ్రామిక వాడగా  విస్తరిస్తున్న  సనత్​నగర్,  బాలానగర్,  జీడిమెట్ల,  నగర శివారులోని   పటాన్ చెరు, లింగంపల్లి,   బీహెచ్ఈఎల్  ప్రాంతాలలో కార్మికుల సమస్యలపై  పనిచేస్తున్న  జి వెంకటస్వామి, టి అంజయ్య,  సంజీవరెడ్డిల నాయకత్వంలో  ఐఎన్టీయూసీ  అనుబంధ కార్మిక నాయకునిగా  రాజకీయ జీవితం ప్రారంభించారు.  

హైదరాబాద్ నగర కాంగ్రెస్  పార్టీ  ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ నగర అధ్యక్షునిగా  పనిచేస్తూ కార్మికులతోపాటు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో యువతరానికి అండగా నిలిచారు. పీజేఆర్​ తొలిసారిగా  ఖైరతాబాద్  నియోజకవర్గంలో  శాసనసభ్యునిగా 1978లో  గెలిచారు.  అదే సమయంలో 1980 –- 82లో  మంత్రిగా  పనిచేశారు.  

ఆయన  మంత్రిగా పనిచేస్తున్న  సమయంలోనే  నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు,  మాజీ సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు  సహచర మంత్రులుగా ఉండేవారు. ఆ తర్వాత కాలంలో 1985, 1989, 1994, 2004లో రాష్ట్రంలోనే అతిపెద్దదైన  ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ నుండి గెలిచి  తన పట్టు నిలుపుకున్నారు. రెండోసారి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్​లో  పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 

  పేదోళ్ల దేవుడు 

1985 ప్రాంతంలో  తెలుగుదేశం పార్టీ అధికారంలో  ఉన్న సమయంలో జంట నగరాల్లో ప్రజలు తాగునీటి కోసం ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో  పెట్టుకొని ఎన్నో సందర్భాల్లో  ధర్నాలు నిర్వహించారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికారులతో చర్చించి హైదరాబాద్ నగరవాసుల తాగునీటి సమస్య పరిష్కరించడానికి కృష్ణానది జలాలను హైదరాబాదు తీసుకువచ్చిన ఘనత  పీజేఆర్​కు దక్కుతుంది.  జూబ్లీహిల్స్​లో పెద్దమ్మ  గుడి ఏర్పాటుకు  పి జనార్దన్ రెడ్డి  అహర్నిశలు  కష్టపడ్డారు.  కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పేదలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిని తిప్పికొట్టేవారు.  నాంపల్లిలోని  గాంధీభవన్ 

విస్తరించడం కోసం పక్కనే ఉన్న పేదల బస్తీని తొలగించాలని  ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది.  దాన్ని పూర్తిస్థాయిలో  వ్యతిరేకించి పేదల పక్షాన నిలిచారు.  2004లో  ఆయన గెలిచినా  వైయస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.  అయినా సరే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి..  తెలుగుదేశం,  టీఆర్​ఎస్ లాంటి  పార్టీలు  స్వాగతం పలికినా  తిరస్కరించి  కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.  హైదరాబాద్ జంట నగరాలలో  పేదల పక్షపాతిగా వారికి అండగా నిలిచిన నాయకుడు పీజేఆర్.  ఆయన మరణం అనంతరం ప్రతి బస్తీలో  ప్రతి ప్రధాన కూడలిలో  పీజేఆర్  విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు కూడా నిర్వహిస్తున్నారు.

- ఆస శ్రీరాములు, సీనియర్ జర్నలిస్ట్