యూఎన్: అమెరికా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలు, జోర్డాన్‌పై ఇరాన్ దాడులు ఆపివేయాలంటూ భద్రతా మండలి తీర్మానించింది. భారత్ కోస్పాన్సర్‌గా తీసుకొచ్చిన ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. బహ్రెయిన్ తీసుకొచ్చిన ఈ తీర్మానంలో భారత్ కోస్పాన్సర్‌గా ఉంది. ఇరాన్ దాడులు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉండగా, 13 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. ఎవరూ వ్యతిరేకంగా ఓటు వేయలేదు కానీ, చైనా, రష్యా మాత్రం ఓటింగ్‌లో పాల్గొనకుండా తటస్థంగా ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలోని పోర్టులు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే శత్రు చర్యలు నిలిపివేయాలని తీర్మానం డిమాండ్ చేసింది.
ఈ తీర్మానానికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో 135 దేశాలు మద్దతు ఇచ్చాయి. భద్రతా మండలి చరిత్రలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద సంఖ్యలో దేశాలు మద్దతు ఇవ్వడం చాలా అరుదని యూఎన్ వర్గాలు వెల్లడించాయి. తీర్మానం ఆమోదం అనంతరం ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం భద్రతా మండలి విశ్వసనీయతకు పెద్ద దెబ్బ అన్నారు. అమెరికా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిందని, ఆ దేశమే ఈ సంక్షోభానికి కారణమని విమర్శించారు.
