మియాపూర్, వెలుగు: హైదరాబాద్‌ను దేశంలోనే ప్రముఖ కార్డియాలజీ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఫెలోస్ ఇండియా ఆర్గనైజింగ్ చైర్మన్ డా. ఎన్. ప్రతాప్ కుమార్ తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ‘ఫెలోస్ ఇండియా 2026’ పేరిట ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ శిక్షణ సదస్సు నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ డాక్టర్లు హాజరు కాగా, తెలంగాణ, ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కార్డియాలజీ ఫెలోస్, యువ కన్సల్టెంట్లు పాల్గొన్నారు.
వీరికి క్లిష్టమైన కోరొనరీ యాంజియోప్లాస్టీలు, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ట్రీట్మెంట్లు, ఆధునిక వాల్వులర్ ప్రొసీజర్లు, కొత్త వైద్య పరికరాలు, భవిష్యత్ కార్డియాలజీపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. ఎన్. ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ.. ఫెలోస్ ఇండియా ద్వారా యువ డాక్టర్లు ప్రపంచ స్థాయి నైపుణ్యాలు సొంతం చేసుకున్నారని చెప్పారు.
ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. శరత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో గుండె వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక శిక్షణ పొందిన డాక్టర్లు రోగులకు మెరుగైన చికిత్స అందించగలరని తెలిపారు.
