
- మళ్లిప్పుడు నాటకాలు ఆడుతున్నరు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- బీసీలను మభ్యపెట్టేందుకు రిజర్వేషన్లపై రాజకీయం చేస్తున్నరు
- బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి కూడా చిత్తశుద్ధి లేదని ఫైర్
- మందమర్రిలో కార్మెల్ డిగ్రీ కాలేజీని ప్రారంభించిన మంత్రి
కోల్‌బెల్ట్, వెలుగు: కేసీఆర్హయాంలోనే బీసీ రిజర్వేషన్లు తగ్గించారని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ‘‘ఆనాడు బీసీల రిజర్వేషన్లు తగ్గించిన బీఆర్ఎస్నాయకులు.. ఇప్పడు ప్రజాదరణ తగ్గడంతో మళ్లీ బీసీ రిజర్వేషన్లంటూ నాటకాలాడుతున్నారు. బీసీలను మభ్యపెట్టేందుకు రిజర్వేషన్ల పేరుతోరాజకీయం చేస్తున్నారు” అని మండిపడ్డారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ కోల్పోయారని, అందుకే జనం కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి కూడా చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు.
రాష్ట్రం పంపిన బిల్లులను కేంద్రం అడ్డుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో మంత్రి వివేక్ పర్యటించారు. కార్మెల్ స్కూల్ఆవరణలో ఏర్పాటు చేసిన కొత్త డిగ్రీ కాలేజీని కలెక్టర్‌కుమార్ దీపక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, అనంతరం మీడియాతో వివేక్ మాట్లాడారు. రాహుల్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ‘‘బీసీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించాం.
కానీ వాటిని గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారు. అవి ఢిల్లీకి చేరి నాలుగు నెలలవుతున్నా ఆమోదం లభించలేదు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కావాలనే బీసీ బిల్లులను అడ్డుకుంటున్నది” అని మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నదని, రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా చూడాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.
అంబేద్కర్ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య..
కాకా అంబేద్కర్విద్యాసంస్థల్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని మంత్రి వివేక్ తెలిపారు. ఎలాంటి డొనేషన్లు లేకుండా కేజీ టు పీజీ విద్య అందిస్తున్నామని, ప్రస్తుతం 5వేల మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఇటీవల ఇండియా టుడే సర్వేలో వాల్యూ ఫర్ మనీలో అంబేద్కర్ విద్యాసంస్థలు దేశవ్యాప్తంగా4వ ర్యాంకు సాధించాయని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో స్టేట్ ర్యాంకులు దక్కాయన్నారు.
విద్యాభివృద్ధికి సర్కార్చర్యలు..
కార్మెల్ విద్యాసంస్థలు కొత్తగా డిగ్రీ కాలేజీ ప్రారంభించడం సంతోషంగా మంత్రి వివేక్ అన్నారు. ఈ విద్యాసంస్థలు 63 ఏండ్లుగా కోల్‌బెల్ట్, పరిసర ప్రాంతాల విద్యార్థులకు విద్యనందిస్తున్నాయని చెప్పారు. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. 10 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. ‘‘పోయినేడాది చెన్నూరు నియోజకవర్గంలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, డ్రింకింగ్వాటర్సౌలతులు కల్పించేందుకు ఫండ్స్ కేటాయించాం.
ఈ ఏడాది విద్యాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. కలెక్టర్ చొరవతో మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. చెన్నూరు నియోజకవర్గంలో రూ.10 కోట్లతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించాం” అని వెల్లడించారు. రూ.200 కోట్లతో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని, చెన్నూరు నియోజకవర్గంలోని సోమనపల్లిలో ఈస్కూల్నిర్మిస్తున్నామని చెప్పారు.
అంతకుముందు మంత్రి వివేక్‌కు విద్యార్థులు, నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. జ్ఞాపిక అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్చ్ బిషప్ కార్డినల్ పూల ఆంటోనీ, ఆదిలాబాద్ బిషప్ ప్రిన్స్ ఆంటోనీ, బిషప్ జోసెఫ్ కున్నాథ్, కార్మెల్ అకాడమీ డైరెక్టర్ ఫాదర్ రెక్స్, ఫాదర్ జీజో, ఫాదర్స్సాఫిన్ తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీని ప్రారంభించిన మంత్రి