సీఎంపై పోటాపోటీగా పొగడ్తలు : సీతక్క సీరియస్

సీఎంపై పోటాపోటీగా పొగడ్తలు : సీతక్క సీరియస్

అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్​ను మంత్రులు, టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు పోటా పోటీగా పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.  కేసీఆర్‌‌ ఒక్కసారి ప్రైమ్​ మినిస్టర్​ అయితే  దేశ చరిత్రనే మారిపోతుందని గురువారం మంత్రి మల్లారెడ్డి అన్నారు. మిషన్​ భగీరథకు కేసీఆరే ఇంజనీర్​ అని, ఆయనే డైరెక్టర్​, నిర్మాత అని, తాము పేరుకు మాత్రమే ఉన్నామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. కేసీఆర్​ హృదయమున్న రాజు అని ప్రశంసించారు. కేసీఆర్​ను సేవాలాల్‌‌గా, మరో గాంధీగా చూసుకుం టున్నామని ఎమ్మెల్యే రేఖానాయక్‌‌  అన్నారు.  కేసీఆర్‌‌ను పొగిడేందుకే అసెంబ్లీ పెట్టినట్లు ఉందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.


కేసీఆర్‌‌ను ఒక్కసారి పీఎంను చేయాలె: మల్లారెడ్డి
కేసీఆర్‌‌ను ఒక్కసారి దేశానికి ప్రధానిని చేస్తే దేశంలో సమస్యలే ఉండవని, తెలంగాణ లెక్క దేశం అభివృద్ధి చెందుతదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ‘‘జాతీయ పార్టీలని చెప్పుకునే పెద్ద పార్టీలున్నయ్. ఎప్పుడో మనం చిన్నప్పుడు చూసిన పథకాలను ఇప్పటికి చెప్పుకుంట నడిపిస్తున్నయ్. 70 ఏండ్లు పాలించిన్రు.  వాళ్లేం చేసిన్రు?” అని ప్రశ్నించారు. ‘‘మన సీఎం ఏడేండ్లల్ల దేశంలనే ఒక చరిత్ర సృష్టించిండు. రాష్ట్రంల ప్రతి ఒక్కరికీ అన్ని అందుబాటులోకి తెచ్చిండు” అని మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. ‘‘అందరి చూపు మన రాష్ట్రం వైపే ఉన్నది. మనం ఎదుగుతుంటే కొందరు ఓర్వలేరు. వాళ్లకు ఇదే సవాల్​. మన ప్రియతమ ముఖ్యమంత్రిని ఒక్కసారి ప్రైమ్​ మినిస్టర్​ చేయాలి. మన సీఎం ఒక్కసారి పీఎం అయితే.. భారతదేశం చరిత్రనే మారిపోతది” అని ఆయన పేర్కొన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతున్నంత సేపు మంత్రుల, ఎమ్మెల్యేలు  నవ్వుతూ కనిపించారు.

కేసీఆర్‌‌ హృదయమున్న  రాజు: ఎర్రబెల్లి
కరెంట్​ లేని ప్రాంతాల్లో కూడా సోలార్​ పవర్​తోటి మంచి నీళ్లు ఇస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. కాంగ్రెస్​ హయాంలో అసెంబ్లీ నడుస్తుంటే కుండలు, బిందెలతో ప్రజలు నీళ్ల కోసం ధర్నాలు చేసేవారని, సీఎ కేసీఆర్​ మిషన్​ భగీరథ తీసుకొచ్చి నీటి కష్టాలు తీర్చారని ఆయన చెప్పారు. ‘‘మిషన్​ భగీరథకు ముఖ్యమంత్రే ఇంజనీర్​. వారే డైరెక్టర్​, వారే నిర్మాత, వారే కథ. మేం ఉత్త పేరుకు పనిచేసేవాళ్లం. కేసీఆర్​ డైరెక్షన్​తోటి దేశంలోనే నంబర్​ వన్​ స్కీంగా మిషన్​ భగీరథ కొనసాగుతున్నది” అని అన్నారు. సీఎం కేసీఆర్​ హృదయమున్న రాజు కాబట్టే ఇన్నాళ్లూ ఎవరూ పట్టించుకోని ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇస్తున్నారని ఆయన ప్రశంసించారు. ‘‘రాయపర్తిలో ఓ వృద్ధురాలికి నేను డబ్బులు ఇవ్వబోతుంటే తనకు డబ్బులొద్దని, తన పెద్ద కొడుకు కేసీఆర్ రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నడని చెప్పింది” అని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

సీఎంలో గాంధీ, సేవాలాల్‌‌ను చూసుకుంటున్నం: రేఖానాయక్‌‌
‘‘నిజంగా మాకు గాంధీ ఎక్కడ ఉన్నరో తెలియదు. గాంధీ ఎలా ఉంటరో తెలియదు. కానీ మా గ్రామాల్లో మేం గాంధీ రూపంలో కేసీఆర్​ సార్​ను  చూస్తున్నం. సేవాలాల్​ మహారాజ్​ రూపంలో కేసీఆర్​సార్​ను చూసుకుంటున్నం” అని ఖానాపూర్‌‌ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. గాంధీజీ, సేవాలాల్ ఆశయాలను కేసీఆర్ అమ‌‌లు చేస్తున్నారని చెప్పారు. ‘‘గాంధీ క‌‌ల‌‌లుగన్న గ్రామ‌‌ స్వరాజ్యం తెలంగాణ ప‌‌ల్లెల్లో క‌‌నిపిస్తోంది. కేసీఆర్ వ‌‌ల్లే తండాలు అభివృద్ధి చెందుతాయి. గిరిజ‌‌న తండాలు, గూడేల‌‌ను గ్రామ‌‌ పంచాయ‌‌తీలుగా తీర్చిదిద్దిన ఘ‌‌న‌‌త కేసీఆర్‌‌దే. గత ప్రభుత్వాలు ఆడ‌‌బిడ్డలు నీళ్ల కోసం ప‌‌డే కష్టాలను ప‌‌ట్టించుకోలేవు. సీఎం కేసీఆర్​ ఇప్పుడు తండాల‌‌కు కూడా మిష‌‌న్ భ‌‌గీర‌‌థ కింద సుర‌‌క్షిత‌‌మైన తాగునీరును స‌‌ర‌‌ఫ‌‌రా చేయిస్తున్నరు. తండాల‌‌కు, గూడేల‌‌కు త్రీ ఫేజ్ క‌‌రెంట్ అందించ‌‌డం గొప్ప విషయం’’ అని ఆమె ప్రశంసించారు.


సీఎంను పొగిడేందుకే అసెంబ్లీనా?: ఎమ్మెల్యే సీతక్క
సీఎంను పొగిడేందుకే అసెంబ్లీ సమావేశాలను పరిమితం చేశారని ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. సీఎంను పొగిడేందుకు అధికార పార్టీ సభ్యులకు గంటలకు గంటలు టైం ఇస్తున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు టైం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఏడేండ్ల నుంచే నీళ్లు తాగుతున్నట్లుగా, అన్నం తింటున్నట్లుగా టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం గన్‌‌ పార్క్‌‌ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ప్రజల బాధలు చెబుదామంటే జీరో అవర్‌‌ కూడా ఎత్తేశారని అన్నారు.  ‘‘ఆహా.. ఓహో అని పొగిడించుకోవడం కోసం అసెంబ్లీ పెట్టినట్లు కనిపిస్తోంది. వారం నుంచి ఇదే జరుగుతోంది. మేం ప్రజా సమస్యల ను ప్రస్తావిస్తే మైక్​ కట్​ చేస్తున్నరు. ఆహా.. ఓహో అని మాట్లాడే వాళ్లకు మాత్రం స్పీకర్​ టైం ఇస్తున్నరు” అని దుయ్యబట్టారు. 

రేఖానాయక్‌‌ వర్సెస్‌‌ సీతక్క
టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రేఖానాయక్​, కాంగ్రెస్​ ఎమ్మెల్యే సీతక్క మధ్య వాగ్వాదం జరిగింది. రేఖానాయక్‌ మాట్లాడుతున్న సమ‌యంలో సీత‌క్క మాట్లాడుతూ.. తండాలు, గిరిజ‌న గూడేల్లో అభివృద్ధి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రేఖానాయక్​ స్పందిస్తూ.. ‘‘బాధలు మేమూ పడినం. నువ్వొక్కదానివే గిరిజన బిడ్డవు కాదు.. మేం కూడా గిరిజన బిడ్డలమే. అర్థమైందా..? ఎస్​... బాధలు చెప్తున్నం” అని మండిపడ్డారు. ‘‘నీకు తెలుసా బాపున‌గ‌ర్ తండా బాధ‌ల గురించి.. నీకు తెలుసా నా ఇంద్రవెల్లి, ఉట్నూరు గిరిజ‌నుల బాధ‌ల గురించీ. మాట్లాడకూ..! మా ఓట్లతో గెలిచావు.. కానీ.. మా సమస్యలు పట్టవు” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చిన్నగున్నప్పుడు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, కాంగ్రెస్‌ నేతలు గీతారెడ్డి, రేణుకా చౌద‌రి తండాల్లో పర్యటించేవారని, కానీ గిరిజనుల కష్టాలను ప‌ట్టించుకోలేద న్నారు.