
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా (అడ్వయిజర్ టు గవర్నమెంట్ ఆన్ అగ్రికల్చర్ అఫైర్స్) వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబును సీఎం కేసీఆర్ నియమించారు. కేబినెట్ హోదాలో 5 ఏండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సీఎంఓ నోట్‌లో పేర్కొన్నారు.
జర్మనీకి చెందిన ‘హంబోల్ట్ యూనివర్సిటీ’ నుంచి అగ్రికల్చర్ ఎకనామిక్స్‌లో పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టాను చెన్నమనేని పొందారని, ఆయనకు అగ్రికల్చర్ ఎకానమీపై ఉన్న అనుభవాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయ అభివృద్ధి కోసం వినియోగించాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు. కాగా, ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో చెన్నమనేని రమేశ్‌కు చోటు కల్పించలేదు. జర్మనీ పౌరసత్వం సమస్య పేరుతో ఆయనకు సీటును కేసీఆర్ నిరాకరించారు. చెన్నమనేని స్థానంలో చల్మెడ లక్ష్మీనరసింహరావుకు టికెట్ ఖరారు చేశారు.