హైదరాబాద్: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఢిల్లీ–హైదరాబాద్ విమానంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని దుండగుడు అధికారులకు మెయిల్ పంపాడు. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశాడు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఎయిర్‌పోర్టులోని విమానాలకు దూరంగా ఫ్లైట్‌ను ల్యాండ్ చేశారు. ఎయిర్ పోర్టులో దిగగానే విమానాన్ని ఫైరింజన్లు చుట్టుముట్టాయి.
అనంతరం బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ విమానంలో తనిఖీలు చేపట్టాయి. కిందికి దిగాక లగేజ్ ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేసిన తర్వాతనే ఎయిర్పోర్టు నుంచి బయటకు వెళ్లాలని ప్రయాణికులకు సూచించారు అధికారులు. ఇందులో భాగంగా ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత బయటకు పంపుతున్నారు. ఇదే విమానంలో MP ఆర్.కృష్ణయ్య, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విమానంలో బాంబ్ ఉందంటూ మెయిల్ పంపిన వ్యక్తి ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు.
