తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‎కు రండి: జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లాకు మంత్రి ఉత్తమ్ ఆహ్వానం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‎కు రండి: జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లాకు మంత్రి ఉత్తమ్ ఆహ్వానం

హైదరాబాద్:​ భారత్ ఫ్యూచర్​ సిటీలో ఈనెల 8,9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్-2047​ గ్లోబల్​ సమ్మిట్‎కు హాజరవ్వాలని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని జమ్ముకశ్మీర్ హౌస్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లాను శుక్రవారం (డిసెంబర్ 5) మంత్రి ఉత్తమ్ కలిశారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్​ సమ్మిట్​ఆహ్వాన పత్రికను జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు.

3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని వివరించారు. దీనికి అనుగుణంగా అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్తు ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్​-2047 విజన్​ డాక్యుమెంట్‎ను రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. నీతి అయోగ్​సలహాలు సూచనలతో పాటు.. అన్ని రంగాల నిపుణుల మేథో మథనంతో తయారు చేసిన ఈ విజన్​ డాక్యుమెంట్‎ను గ్లోబల్​సమ్మిట్‎లో ఆవిష్కరించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒమర్ అబ్దుల్లాకు వివరించారు.

ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమ్మిట్ కి ఆహ్వానించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, స్వయంగా ఆహ్వానపత్రాన్ని అందచేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సమ్మిట్‎కు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నానని కానీ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆశిస్తున్నానని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా  అభివృద్ధి చెందుతుందని విశ్వసిస్తున్నానని చెప్పారు.