Vaibhav Suryavanshi: 14 ఏళ్ళ కుర్రాడి ధాటికి కోహ్లీ, రోహిత్, గిల్ వెనక్కి.. గూగుల్‌ సెర్చ్‌లో సూర్యవంశీ టాప్

Vaibhav Suryavanshi: 14 ఏళ్ళ కుర్రాడి ధాటికి కోహ్లీ, రోహిత్, గిల్ వెనక్కి.. గూగుల్‌ సెర్చ్‌లో సూర్యవంశీ టాప్

2025 "మోస్ట్ గూగుల్ సెర్చ్ ఇన్ ఇండియా" ప్లేయర్ లిస్ట్ తీస్తే వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉన్నాడు. వైభవ్ తర్వాత ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య ఉన్నాడు. టీమిండియా ఓపెనర్, నెంబర్ వన్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. షేక్ రషీద్ నాలుగో స్థానంలో.. భారత మహిళా క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఐదవ స్థానంలో ఉన్నారు. స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు టాప్-5 లో లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయుష్ మాత్రే, స్మృతి మంధాన, కరుణ్ నాయర్, ఉర్విల్ పటేల్, విఘ్నేష్ పుత్తూరు వరుసగా 6,7,8,9,10 స్థానాల్లో నిలిచారు. 

2025 లో ఎక్కువగా వినిపించిన పేరు ఏదైనా ఉందంటే అది 14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లో 35 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచిన సూర్యవంశీ.. ఆ తర్వాత కూడా అస్సలు తగ్గేదే లేదంటూ చెలరేగిపోయాడు. భారత-ఏ జట్టు తరపున ఆడుతూ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై అదరగొట్టాడు. ఇటీవలే అండర్ -19 రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఆసియా కప్‌లో యుఎఇపై 42 బంతుల్లో 144 పరుగులు చేసి సంచల ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీ ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. ప్రత్యర్థి ఎవరైనా సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడు. తాజాగా  ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్రపై శతకంతో మెరిశాడు.

రెండో స్థానంలో ప్రియాన్స్ ఆర్య ఉన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో పంజాబ్ తరపున 38 బంతుల్లోనే సెంచరీ చేసి ఆకట్టుకున్న ఆర్య.. ఆ తర్వాత ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో రూ. 3.80 కోట్ల ధర పలికి ఆశ్చర్యానికి గురి చేశాడు. మూడో స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్ తో దూసుకెళ్లాడు. ఐపీఎల్ లో అదరగొట్టడంతో పాటు ఆసియా కప్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడడం ద్వారా.. ఆ తర్వాత ఐదో స్థానంలో ఉన్న జెమీమా ఆస్ట్రేలియాపై సెమీ ఫైనల్ లో అద్భుత సెంచరీ కారణంగా ఎక్కువ మంది పీపుల్స్ వీరిని గూగుల్ లో సెర్చ్ చేశారు.