Akhanda 2 బిగ్ బ్రేకింగ్: బాలయ్య అభిమానులకు షాక్.. ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా.. అసలు కారణమిదే!

Akhanda 2 బిగ్ బ్రేకింగ్:  బాలయ్య అభిమానులకు షాక్.. ‘అఖండ 2’ రిలీజ్ వాయిదా.. అసలు కారణమిదే!

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'అఖండ 2: తాండవం' (Akhanda 2:Thaandavam). బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇవాళ (డిసెంబర్ 5న) ప్రపంచవ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. కానీ, అనివార్య పరిస్థితుల వల్ల వాయిదా పడింది. డిసెంబర్ 4 అర్థరాత్రి సమయంలో ‘అఖండ 2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారిక ప్రకటన చేసింది. ఈ అప్డేట్ అభిమానుల్లో మాత్రమే కాదు సినీ ఫ్యాన్స్ని కూడా తీవ్ర నిరాశ పరిచింది. ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే.. అందరినీ బాధపెట్టింది.

నిర్మాణ సంస్థ 14 రీల్స్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేసింది. ‘‘బరువైన హృదయంతో ప్రకటిస్తున్నాం.. అనివార్య కారణాల వల్ల ‘అఖండ 2’ షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు. ఈ విషయం మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాం. ఈ  క్షణం మాకు చాలా బాధాకరమైనది. ప్రతి అభిమాని, సినీ ప్రేమికుడికి ఇది కలిగించే నిరాశను మేము అర్థం చేసుకున్నాము. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాము. ఈ నిర్ణయం పట్ల కలిగిన అసౌకర్యానికి మా హృదయపూర్వక క్షమాపణలు. ఈ సమయంలో మీ మద్దతు మాకు చాలా అవసరం. అతి త్వరలో సానుకూల నిర్ణయంతో మీ ముందుకు వస్తాం. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తున్నాం’’ అని నిర్మాణ సంస్థ పేర్కొంది. 

వాయిదాకి అసలు కారణం ఇదేనా:

అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ అయిన "14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్" ఆర్థికపరమైన విషయాల్లో సమస్యలు తలెత్తడంతోనే వాయిదా పడినట్లు సినీ వర్గాల సమాచారం. అంతేకాకుండా సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లకు మేకర్స్ డబ్బులు చెల్లించాల్సి ఉందని కూడా మరో టాక్ వినిపిస్తుంది. అలాగే, టెక్నీకల్ ఇస్యూస్ వల్లే సినిమా ఆగిపోయిందనే ఇంకో వార్త కూడా వైరల్ అవుతుంది. అసలు కారణాలు ఏంటనేది మాత్రం మేకర్స్ ప్రకటిస్తేనే సరైన స్పష్టత వస్తుంది. ఏదేమైనా సడెన్గా సినిమా విడుదల ఆగిపోవడం అభిమానులను తీవ్ర కలత చెందేలా చేసింది.   

ముందుగా గురువారం రాత్రి 8 గంటలకు వేయాల్సిన ప్రీమియర్స్ షోలు రద్దయ్యాయి. ఆ తర్వాత శుక్రవారం విడుదల కావాల్సిన సినిమాని కూడా వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ ప్రకటించింది. అయితే, కొత్త డేట్ ఏంటనేది మాత్రం చెప్పలేదు. ఇవాళ శుక్రవారం కొత్త  రిలీజ్ డేట్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఆర్ధిక సమస్యలు: ఏం జరిగింది:

అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ అయిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్కు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్పై Eros International Media Ltd మద్రాస్ హైకోర్టులో కేసు గెలిచింది. Eros International Media Ltdకు చెల్లించాల్సిన సుమారు 28 కోట్ల ఆర్బిట్రేషన్‌ అవార్డ్‌ (మధ్యవర్తిత్వ పరిహారం) చెల్లించేంత వరకూ అఖండ 2 సినిమాను విడుదల చేయకూడదని గురువారం (Dec 4న) మద్రాస్ హైకోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ2 సినిమా విడుదలకు అనుకోని ఆటంకం ఎదురైంది. జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం, జస్టిస్ సి.కుమరప్పన్తో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది. 

ఇక ఇప్పుడు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు Eros సంస్థకు అనుకూలంగా రావడంతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. పూర్తి ఆర్బిట్రల్ అవార్డు మొత్తం 27 కోట్ల 80 లక్షల 18 వేల 13 రూపాయలు.. 14 శాతం వడ్డీ ఈరోస్‌కు చెల్లిస్తేనే సినిమాను విడుదల చేయాలని అఖండ 2 విడుదలకు ముందు మద్రాస్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.