ఎమ్మెల్యేలను సభలోంచి ఈడ్చేశారు

ఎమ్మెల్యేలను సభలోంచి ఈడ్చేశారు
  • బీహార్​ అసెంబ్లీలో పోలీసుల దుశ్చర్య
  • స్పెషల్​ ఆర్మ్​డ్​ పోలీస్​ బిల్ ​2021పై రగడ

పాట్నా: బీహార్​ అసెంబ్లీ మంగళవారం రక్తసిక్తంగా మారింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలపై దాడి చేశారు. మరికొంతమందిని ఈడ్చుకుంటూ సభలోంచి వెలుపలికి తీసుకొచ్చారు. రాష్ట్ర పోలీసులకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే బిల్లు‘బీహార్​ స్పెషల్​ఆర్మ్​డ్​ పోలీస్​ బిల్​2021’ పై చర్చ సందర్భంగా ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లును మూడు రోజుల కింద మొదటిసారి సభలో ప్రవేశపెట్టగా.. ఆర్జేడీ ఎమ్మెల్యేలు బిల్లు కాపీలను చించేశారు. పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. బిల్లు వాపస్​ తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సభను కొనసాగించే పరిస్థితి లేకపోవడంతో స్పీకర్​ మంగళవారానికి సభను వాయిదా వేశారు. మంగళవారం కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఎమ్మెల్యేల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో వారిని బయటికి పంపించాలని మార్షల్స్​ను స్పీకర్​ ఆదేశించారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలను తరలించే క్రమంలో వివాదం రేగింది. మార్షల్స్ వారిని కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ బయటికి తీసుకొచ్చారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలకు తీవ్ర గాయాలయ్యాయి. పలువురు రక్తమోడారు. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలను ఈడ్చుకుంటూ సభ నుంచి బయటకు తీసుకొస్తున్న వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.