రాజకీయ విమర్శల జోలికెళ్లని మోడీ

రాజకీయ విమర్శల జోలికెళ్లని మోడీ

విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ ప్రసంగం మొత్తం అభివృద్ధి, సంక్షేమం, తెలంగాణ గొప్పదనం చుట్టే సాగింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వారం ముందు నుంచే కేసీఆర్‌‌, కేటీఆర్‌‌, టీఆర్‌‌ఎస్‌‌ నేతలు హడావుడి చేసినా మోడీ తన స్పీచ్‌‌లో రాజకీయాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని, కొత్త తెలంగాణను చూపిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ చైతన్యాన్ని, పోరాట పటిమను కీర్తించారు. చారిత్రక వారసత్వ సంపదను, ఈ నేల గొప్పతనాన్ని కొనియాడారు. ఎనిమిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్రానికి ఏం చేశారో.. రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో వివరించారు. బీజేపీ సమావేశాలకు ప్రచారం దక్కొద్దని రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ నేషనల్‌‌ మీడియాలో టీఆర్ఎస్​ నేతలు అడ్వర్టయిజ్‌‌మెంట్లు ఇవ్వడం, హైదరాబాద్‌‌ నగరాన్ని హోర్డింగ్‌‌లు, ఫ్లెక్సీలతో  నింపేయడమే కాక.. బహిరంగ సభ జరిగే పరేడ్‌‌ గ్రౌండ్‌‌ ఎదుట గులాబీ బెలూన్స్‌‌ ఎగరేసి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా మోడీ వాటిని పట్టించుకోలేదు. రాజకీయ విమర్శలకు తావివ్వలేదు.