
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: చదువుకుంటేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలం శ్రీపురం జడ్పీ హైస్కూల్ ను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఎదిగేందుకు క్రమశిక్షణతో ముందుకెళ్లాలన్నారు. పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా, ఉన్నత విలువలు నేర్పించడంపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని సూచించారు.
క్రమశిక్షణతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణం విద్యార్థుల అభివృద్ధికి ముఖ్యమన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రతి రోజు స్కూల్‌కు వచ్చేలా చూడాలని, ఇందుకోసం పేరెంట్స్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూరు చెరువు వద్ద వినాయక నిమజ్జనం కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి, పలు సూచనలు చేశారు.