చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో.. హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్

చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో.. హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్
  • మైనర్లపై రేప్ కేసుల్లో మహారాష్ట్ర టాప్
  • ఎనిమిదో స్థానంలో తెలంగాణ
  • చీటింగ్ కేసులపరంగా మొదటి స్థానంలో హైదరాబాద్
  • నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వెల్లడి

సికింద్రాబాద్, వెలుగు: చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో హైదరాబాద్.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అశ్లీల వీడియోల కోసం పిల్లలను ఉపయోగించడంతో పాటు వాటిని స్టోర్ చేయడంలోనూ హైదరాబాద్ సిటీ టాప్​లో ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్​సీఆర్బీ) రికార్డులు చెప్తున్నాయి. ఈ వీడియోలు చూడటానికి అలవాటుపడిన వారిలో కొందరు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తుండగా.. మరికొందరు పలు సైట్ల నుంచి వాటిని డౌన్​లోడ్ చేసి వేర్వేరు సైట్లలో అప్​లోడ్ చేస్తున్నారు. మైనర్లపై రేప్ కేసుల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ 8వ స్థానంలో ఉంది. చిన్న పిల్లలతో పోర్న్ వీడియోలు తీస్తున్న దేశంలోని 18 ప్రధాన నగరాల్లో 52 మంది బాధితులను ఎన్​సీఆర్బీ గుర్తించింది. అందులో 21 మంది హైదరాబాద్ సిటీకి చెందిన వాళ్లే ఉన్నారు. 2022లో నమోదైన లెక్కల ప్రకారం.. 21 మంది బాధితులతో హైదరాబాద్​లో ఫస్ట్ ప్లేస్​లో, 10 మంది బాధితులతో జైపూర్ సెకండ్ ప్లేస్​లో, ఆరుగురు బాధితులతో చెన్నై థర్డ్ ప్లేస్​లో ఉన్నట్లు ఎన్​సీఆర్​బీ లెక్కలు చెప్తున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే.. 202 మంది బాధితులతో బీహార్ ఫస్ట్ ప్లేస్​లో, 170 మంది బాధితులతో రాజస్థాన్, 46 మంది బాధితులతో జార్ఖండ్ వరుసగా సెకండ్, థర్డ్ ప్లేస్​లో ఉన్నాయి. లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించడం, పోక్సో చట్టం అమలు చేయడంలో 2,730 మంది బాధితులతో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. యూపీలో 7,970 మంది బాధితులు, మహారాష్ట్రలో 7,675 మంది, మధ్యప్రదేశ్​లో 5,951 మంది బాధితులు ఉన్నట్లు ఎన్​సీఆర్​బీ గుర్తించింది. 

చీటింగ్ కేసు బాధితుల్లో హైదరాబాద్ రెండో ప్లేస్

దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన 24,606 చీటింగ్ కేసుల్లో.. 3,414 కేసులు (సెక్షన్ 420) హైదరాబాద్​లోనే రిజిస్టర్ అయ్యాయి. ఎన్​సీఆర్​బీ 2022 ప్రకారం.. కేసుల పరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో, బాధితుల పరంగా రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా మైనర్ బాలికలను మాటలతో మభ్యపెట్టి పోర్న్ వీడియోలు తీయడం, వారిని చీట్ చేయడంపై దేశ వ్యాప్తంగా 26,224 మంది బాధితులను ఎన్​సీఆర్​బీ గుర్తించింది. అందులో 4,118 మంది బాధితులతో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్​లో, 3,434 మంది బాధితులతో హైదరాబాద్ సెకండ్ ప్లేస్​లో, 2,365 మందితో జైపూర్ మూడో ప్లేస్​లో ఉంది. మైనర్ల వయస్సు రీత్యా తప్పుడు ఏజ్ ప్రూఫ్ డాక్యుమెంట్లు సృష్టించిన కేటగిరిలో 5,789 ఘటనలతో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్​లో ఉంది. వీటిలో మొత్తం 5,819 మంది బాధితులు ఉన్నారు. 2021లో 4,679 ఘటనలతో  ఢిల్లీ మొదటి స్థానంలో, 4,679 ఘటనలతో హైదరాబాద్ రెండో స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ సిటీలో నమోదైన 4,679 సంఘటనల్లో 4,737 మంది బాధితులు ఉన్నారు.

దోషిగా తేలితే..  యావజ్జీవ లేదా ఉరి శిక్ష

మైనర్లతో పోర్న్ వీడియోలు తీసినా, వారిపై లైంగిక దాడికి పాల్పడినా పోక్సో చట్టం కింద కేసు నమోదవుతుంది. అమ్మాయి మైనర్ అయి.. ఆమె అంగీకారంతో శారీరకంగా కలిసినా.. ఆమెతో పోర్న్ వీడియోలు తీసి వెబ్​సైట్​లో పెట్టినా నేరమే. నిందితుడు దోషిగా తేలితే అతనికి జీవితకాలం జైలు శిక్ష లేదా ఉరి శిక్ష పడుతుంది. అత్యాచార నిందితులపై ఐపీసీ సెక్షన్ 4, సెక్షన్ 6, సెక్షన్ 376, పోక్సో కేసు నమోదు చేస్తారు.