నేపాల్ తదుపరి ప్రధానిగా ప్రచండ

 నేపాల్ తదుపరి ప్రధానిగా ప్రచండ
  • సంకీర్ణం నుంచి వైదొలిగిన మావోయిస్టు సెంట్రల్ పార్టీ

ఖాట్మండు: నేపాల్ రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపాల్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కుప్పకూలింది. కూటమి నుంచి మావోయిస్టు సెంట్రల్ పార్టీ వైదలగడంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ప్రధాని మంత్రి పదవి విషయంలో నేపాల్ కాంగ్రెస్, మావోయిస్టు సెంట్రల్ పార్టీ మధ్య ఒప్పందం కుదరలేదు.

 రెండున్నరేండ్లు ప్రధాన మంత్రి పదవి ఇవ్వాలని మావోయిస్టు సెంట్రల్ పార్టీ చైర్మన్ ప్రచండ డిమాండ్ చేశారు. దీనికి నేపాల్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు ప్రస్తుత ప్రధాని షేర్ బహదుర్ దేవ్ బా ఒప్పుకోలేదు. కేవలం స్పీకర్ పదవి మాత్రమే ఇస్తామని ఆఫర్ చేశారు. దీనిని తిరస్కరించిన మావోయిస్టు సెంట్రల్ పార్టీ..కూటమి నుంచి వైదొలిగింది. 

కమ్యూనిస్టు పార్టీ నేత కేపీ ఓలీతో సమావేశమైన ప్రచండ.. మద్దతుదారులతో కలిసి ప్రతిపక్ష పార్టీకి మద్దతు తెలిపారు. రెండు పార్టీల మధ్య ప్రధాన మంత్రి పంపకాలపై ఒప్పందం కుదిరింది. తొలి రెండున్నరేండ్లు ప్రచండ ప్రధానిగా ఉండేందుకు నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేత కేపీ ఓలీ అంగీకరించారు. 

ఈ కూటమిలో  రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, జనతా సమాజ్ వాది పార్టీ,  జనమంత్ పార్టీలు చేరాయి. కేపీ ఓలీతో కలిసి ప్రచండ రాష్ట్రపతిని కలిశారు. ప్రధాన మంత్రి అభ్యర్థిత్వాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. తదుపరి ప్రధానిగా ప్రచండను నియమిస్తూ నేపాల్ రాష్ట్రపతి కార్యాలయం లేఖ విడుదల చేసింది.