ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణ పనులు షురూ

ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మాణ పనులు షురూ
  • రెండున్నరేండ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యం

హైదరాబాద్, వెలుగు: దసరా రోజున ఉస్మానియా జనరల్ కొత్త హాస్పిటల్ బిల్డింగుల నిర్మాణం ప్రారంభ మైంది. అత్యాధునిక సౌకర్యాలతో, 2 వేల బెడ్స్​తో నిర్మించనున్నారు. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌‌‌‌ ఫ్రాస్ట్ర క్చర్స్ లిమిటెడ్‌‌‌‌ (ఎంఈఐఎల్) ప్రాజెక్టుల డిపార్ట్మెంట్ అధ్యక్షుడు కె. గోవర్ధన్ రెడ్డి గురువారం పూజలు నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. హైదరాబా ద్‌‌‌‌లోని గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఉస్మానియా కొత్త ఆస్పత్రి నిర్మించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ ఏడాది జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్ణయించిన గడువులోనే పనులు పూర్తి చేస్తామన్నారు. కొత్త హాస్పిటల్ బిల్డింగుల్లో సౌకర్యాలు ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు దీటుగా ఉంటాయని, అడ్వాన్సుడ్ టెక్నాలజీ, ఆధునిక వసతులతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. 

26 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో

ఈ కొత్త బిల్డింగ్ ను 26 ఎకరాల విస్తీర్ణంలో, 32 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో డెవలప్ చేయనున్నారు. నర్సింగ్‌‌‌‌, డెంటల్‌‌‌‌, ఫిజియోథెరపీ కాలేజీలు వేర్వేరుగా నిర్మించనున్నారు. ఇందులో 2 వేల బెడ్స్, 29 ప్రధాన, 12 చిన్న ఆపరేషన్ థియేటర్లు, 1,500 కార్లు పట్టేలా రెండు స్థాయిల బేస్‌‌‌‌మెంట్ పార్కింగ్ సౌకర్యాలతో కొత్త హాస్పిటల్ ను తీర్చిదిద్దనున్నారు. 

హాస్పిటల్ బ్లాక్‌‌‌‌ 22.96 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో, అకడామిక్ బ్లాక్‌‌‌‌, పురుష, మహిళా హాస్టల్ బ్లాకులు, ధర్మశాల, మార్చురీ, యుటిలిటీ బిల్డింగ్‌‌‌‌, సెక్యూరిటీ బిల్డింగ్‌‌‌‌ మిగిలిన తొమ్మిది లక్షల నాలుగు వేల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. ఈ నిర్మాణ పనులను రెండేండ్ల కాలంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, రోగులకు మంచి గాలి అందేందుకు బిల్డింగ్ రూఫ్‌‌‌‌ టాప్ టెర్రస్ గార్డెన్లు, క్రాస్ వెంటిలేషన్ టెక్నాలజీలతో నిర్మించనున్నారు.