న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. ఆదివారం (జనవరి 18) ఇండోర్ వేదికగా హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా మ్యాచ్ తో పాటు 1-2 తేడాతో సిరీస్ కూడా ఇండియా చేజార్చుకుంది. 338 పరుగుల ఛేజింగ్ లో కోహ్లీ వీరోచిత సెంచరీ (124) చేసి పోరాడినా ఫలితం లేదు. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదరగొట్టిన న్యూజిలాండ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకొని మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.
71 పరుగులకే నాలుగు వికెట్లు:
338 పరుగుల భారీ ఛేజింగ్ లో బరిలోకి దిగిన ఇండియాకు మంచి ఆరంభం లభించలేదు. ఈ సిరీస్ లో ఫామ్ లో లేని రోహిత్ శర్మ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. నాలుగు ఫోర్లు కొట్టి మంచి టచ్ లో కనిపించిన గిల్ ను జెమీసన్ ఒక చక్కటి బంతితో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ , కేఎల్ రాహుల్ కూడా సింగిల్ డిజిట్ కే ఔట్ కావడంతో టీమిండియా 71 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఒక ఎండ్ లో వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో కోహ్లీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. కివీస్ బౌలర్లను అలవోకగా ఆడేసి పరుగులు రాబట్టాడు.
కోహ్లీ ఒంటరి పోరాటం:
71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినా నితీష్ కుమార్ రెడ్డితో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి కోహ్లీ ఐదో వికెట్ కు 88 పరుగులు జోడించి ఆశలు సజీవంగా ఉంచాడు. అయితే స్వల్ప వ్యవధిలో నితీష్, జడేజా ఔట్ (12) ఔట్ కావడంతో ఇండియా పరాజయం ఖాయం అనుకున్నారు. ఈ దశలో హర్షిత్ రానా, కోహ్లీ జోడీ ఇండియా విజయంపై ఆశలు రేకెత్తించింది. ఇద్దరూ కూడా ప్రతి ఓవర్ లో జాగ్రత్తగా ఆడుతూ వేగంగా పరుగులు రాబట్టారు. ఏడో వికెట్ కు 99 పరుగులు జోడించి మ్యాచ్ ను గెలుపు దిశగా తీసుకెళ్లారు. 52 పరుగులు చేసి ఊపుమీదు కనిపించిన హర్షిత్ రానా పెవిలియన్ కు చేరడంతో కోహ్లీపై భారం మొత్తం పడింది.
మిచెల్, ఫిలిప్స్ సెంచరీలతో కివీస్ కు భారీ స్కోర్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ఊహించని ఆరంభం లభించింది. ఆ జట్టు 5 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. తొలి ఓవర్లో అర్షదీప్ సింగ్ నికోల్స్ (0) క్లీన్ బౌల్డ్ చేస్తే.. రెండో ఓవర్లో హర్షిత్ రానా.. కాన్వే (5)ను పెవిలియన్ కు పంపాడు. భారత పేసర్లు విజృంభించడంతో 5 పరుగులకే న్యూజిలాండ్ రెండు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన డారిల్ మిచెల్ జట్టును ముందుండి నడిపించాడు. మూడో వికెట్ కు విల్ యంగ్ తో కలిసి 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 30 పరుగు చేసి క్రీజ్ లో సెట్ అయిన విల్ యంగ్ ను రానా ఔట్ చేయడంతో 58 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి మిచెల్ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరిద్దరూ చాలా ఈజీగా టీమిండియా బౌలర్లను ఆడేశారు. ఓ వైపు మిచెల్, మరోవైపు ఫిలిప్స్ మొదట సింగిల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేసినా క్రమంగా బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలో మిచెల్ హాఫ్ సెంచరీతో పాటు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత మిచెల్ కూడా సెంచరీ చేసి సత్తా చాటాడు. వీరి జోడీ నాలుగో వికెట్ కు ఏకంగా 219 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు భారీ అందించారు. స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటైనా చివర్లో కెప్టెన్ బ్రేస్ వెల్ (28) వేగంగా ఆడి జట్టు స్కోర్ ను 330 పరుగులు దాటించాడు. ఇండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్, హర్షిత్ రానా తలో మూడు వికెట్లు పడగొట్టారు. సిరాజ్, కుల్దీప్ తలో వికెట్ తీసుకున్నారు.
New Zealand register a 41-run victory in the decider and win the series 2-1
— BCCI (@BCCI) January 18, 2026
Scorecard ▶️ https://t.co/KR2ertVUf5#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/JuuARZ4y53
