అకాల వర్షంతో రెండు జిల్లాల పరిధిలో రూ.55లక్షల నష్టం : కర్నాటి వరుణ్​ రెడ్డి

అకాల వర్షంతో రెండు జిల్లాల పరిధిలో రూ.55లక్షల నష్టం : కర్నాటి వరుణ్​ రెడ్డి
  • ఎన్​పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్​ రెడ్డి

ములుగు, వెలుగు: రెండు రోజులుగా ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం, ఈదురుగాలులు వీయడంతో విద్యుత్​ స్తంభాలు నేలకొరిగి పలు గ్రామాలకు సరఫరా నిలిచిపోయిందని, వెంటనే అధికారులు, సిబ్బంది స్పందించి రాత్రింబవళ్లు కష్టపడి పునరుద్ధరణ చేపట్టారని ఎన్​పీడీసీఎల్​ సీఎండీ కర్నాటి వరుణ్​ రెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి సర్కిల్​పరిధిలోని భూపాలపల్లి జిల్లా రేగొండ, గణపురం, ములుగు జిల్లా వెంకటాపూర్​మండలం వెల్తుర్లపల్లి సబ్​ స్టేషన్ల పరిధిలో ధ్వంసమైన, పునరుద్ధరించబడిన విద్యుత్​ లైన్లను క్షేత్రస్థాయిలో సీఎండీ పరిశీలించారు. 

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రాత్రంతా సిబ్బంది శ్రమించి విద్యుత్​ పునరుద్ధరించారని కొనియాడారు. ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో 351 విద్యుత్​ స్తంభాలు నేలకొరిగాయని, సుమారుగా రూ.55లక్షల మేర నష్టం జరిగినట్లు సీఎండీ వివరించారు. రేగొండ, గణపురం, వెల్తుర్లపల్లి సబ్​ స్టేషన్ల పరిధిలోనే భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. కార్యక్రమంలో సీఈ రాజు చౌహన్, భూపాలపల్లి సర్కిల్ ఎస్​ఈ మల్చూర్ నాయక్, జీఎం ఏ.సురేందర్, ములుగు డీఈ నాగేశ్వర్ రావు, భూపాలపల్లి డీఈ పాపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.