ఇది యాపారం.. టైటానిక్ సబ్ మెరైన్ టూర్ మళ్లీ ప్రారంభం..

ఇది యాపారం.. టైటానిక్ సబ్ మెరైన్ టూర్ మళ్లీ ప్రారంభం..

టైటానిక్ సబ్ మెర్సిబుల్ నౌక సముద్రంలో మునిగి ఐదుగురు ప్రయాణికులు చనిపోయిన విషాదకరమైన ఘటన మరవకముందే.. ఓషన్‌గేట్ ఓ ఆశ్చర్యకర ప్రకటన వెలువరిచింది. టైటానిక్ షిప్‌బ్రెక్‌కు భవిష్యత్తులో సాహసయాత్రలను అందించేందుకు మళ్లీ సమాయత్తం అవుతోంది. 2024లో షెడ్యూల్ చేయబడిన పర్యటనలను ప్రమోట్ చేస్తూ, ఈ సాహసయాత్రల కోసం కంపెనీ జూన్ 12 నుంచి 20, జూన్ 21నుంచి 29 వరకు రెండు వారాలను నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో సబ్‌మెర్సిబుల్ డ్రైవ్, ప్రైవేట్ వసతి, సాహసయాత్ర, బోర్డ్‌లో భోజన సదుపాయం, సమగ్ర శిక్షణ లాంటివి అన్నీ ఉన్నాయి. ఈ అపూర్వ అనుభవం కోసం ఒక్కో వ్యక్తికి అయ్యే ఖర్చు రూ.2.03 కోట్లుగా కంపెనీ ప్రకటించింది..

ఓషన్‌గేట్ వెబ్‌సైట్‌లోని జాబితా ప్రకారం, టైటానిక్ శిథిలాల యాత్రలో మొదటి రోజు కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని సెయింట్ జాన్స్ తీరప్రాంత నగరానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ పాల్గొనేవారు వారి సాహసయాత్ర సిబ్బందిని కలుసుకుని ఓడలో ఎక్కుతారు. దీన్ని "మీ సాహసయాత్ర సిబ్బందిని కలవడానికి సెయింట్ జాన్స్ సముద్రతీర నగరానికి చేరుకోండి. RMS టైటానిక్ శికలాల వద్దకు మిమ్మల్ని తీసుకెళ్లే ఓడలో ఎక్కండి" అనే ప్రకటనతో వివరించింది.

రెండవ రోజు యాత్రలో పాల్గొనేవారు ఉత్తర అట్లాంటిక్ మీదుగా శిథిలాల ప్రదేశం వైపు 400-నాటికల్-మైళ్ల ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. సెయిలింగ్ తరువాత, తరువాతి నాలుగు రోజులు మిషన్‌కే అంకితం అవుతారు, ఇందులో పాల్గొనేవారు టైటాన్ సబ్‌మెర్సిబుల్‌లో 12వేల 500 అడుగుల లోతైన శిథిలాలలోకి ప్రవేశిస్తారని తెలిపింది.

ఇక జూన్ 18న జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారిలో ఓషన్‌గేట్ CEO స్టాక్‌టన్ రష్ తో పాటు, బ్రిటిష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ప్రముఖ పాకిస్థానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని 19 ఏళ్ల కుమారుడు సులైమాన్ దావూద్ ఉన్నారు.