- ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నా స్పందన అంతంతమాత్రమే
- మూడేళ్లలో 12 శాతం కూడా చేరని సాగు లక్ష్యం
- ఉమ్మడి కరీంనగర్జిల్లాలో 1,30,786 ఎకరాలకు గానూ 15,426 ఎకరాల్లోనే సాగు
కరీంనగర్, వెలుగు: ఒక్కసారి నాటితే నాలుగేళ్ల తర్వాత నుంచి 35 ఏళ్లపాటు ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు అనాసక్తి చూపుతున్నారు. అవగాహన లేక కొందరు, ఆదాయం వస్తుందో లేదోనన్న అపనమ్మకంతో మరికొందరు సాగుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం సాగు ఖర్చులకు సబ్సిడీ ఇస్తున్నా రైతులు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2022 నుంచి 2026 వరకు 1,30,786 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 15,426 ఎకరాల్లో మాత్రమే సాగుచేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. రైతులకు అవగాహన కల్పించడంలో అధికారుల అలసత్వమే ఇందుకు కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సబ్సిడీ ఇస్తామన్నా ఆసక్తి చూపట్లే
ఆయిల్‌పామ్ సాగువైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ఆకర్షణీయమైన సబ్సిడీ ఇస్తున్నా రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆయిల్‌పామ్ సాగు కోసం ప్రభుత్వం రైతుకు ఒక్కో ఎకరాకు రూ.50,600 రాయితీ ఇస్తోంది. ఎకరంలో 57 మొక్కలు నాటాల్సి ఉంటుంది. ఒక్కో నాణ్యమైన మొక్కకు రూ.200 చొప్పున 57 మొక్కలకు రూ.11,400 అవుతోంది. ఇందులో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుండగా.. రైతు వాటా కింద రూ.1,140 చెల్లిస్తే సరిపోతుంది.
అలాగే రూ.30 వేలు విలువ చేసే డ్రిప్ కోసం రైతు రూ.7 వేలు చెల్లిస్తే.. ప్రభుత్వం మరో రూ.23 వేలు భరిస్తుంది. అదే బీసీ రైతులకు 90 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ వస్తోంది. మొక్కలు నాటాక మూడు లేదా నాలుగేళ్ల వరకు గెలలు రావు.
ఆ సమయంలోనూ మొక్కల పెంపకంతోపాటు ఆ తోటలో అంతర పంటల సాగు కోసం ప్రభుత్వం ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్లకు రూ.16,800 చెల్లిస్తుంది. నాలుగేళ్ల తర్వాత పంట చేతికొచ్చాక 30 ఏండ్ల వరకు ప్రతి ఏటా ఎకరానికి రూ.2 లక్షలకుపైగా ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
టార్గెట్లుగా పెద్దగా.. సాగయింది తక్కువగా..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగుపై 2022 నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2022– 26 వరకు నాలుగేళ్లలో 1,30,786 ఎకరాలు సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2026 వరకు పెద్దపల్లి జిల్లాలో 45,172 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 44,527 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 32,587 ఎకరాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,500 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రెండేళ్లలో పెద్దపల్లి జిల్లాలో 2980 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 2,118 ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 4,459 ఎకరాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,189 ఎకరాల్లో మాత్రమే సాగయింది.
2025–26లో జగిత్యాల జిల్లాలో 3,750 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం 450 ఎకరాల్లో, కరీంనగర్ 3 వేల ఎకరాలకు గానూ 850 ఎకరాలకు, పెద్దపల్లి 2,500 ఎకరాలకు గానూ 380, సిరిసిల్ల జిల్లాలో 2 వేలకు 189 ఎకరాల్లో మాత్రమే కొత్తగా సాగు చేశారు.
