రాష్ట్రంలో ఒకప్పుడు పేరు మోసిన ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ రాజకీయ ప్రస్థానాన్ని సర్పంచ్ పదవి నుంచే ప్రారంభించారు. వీరిలో కొందరు ఎన్నిక లేకుండానే ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యారు. తమ ఊరు ఇచ్చిన బలంతో రాజకీయాల్లో నిలదొక్కుకొని ఆ తర్వాతి కాలంలో చట్టసభల వరకు వెళ్లారు. కొందరు ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా కూడా పనిచేశారు.
సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం వారికి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కొనసాగడానికి ఎంతో ఉపకరించింది. ఈ రోజుల్లో చాలా మంది లీడర్లు డైరెక్ట్‌గా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడం తప్ప.. ఇలా లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఎందరో లీడర్లు...
హుజూరాబాద్ మండలం సింగాపూర్‌కు చెందిన వొడితల రాజేశ్వర్‌రావు సర్పంచ్‌గానే రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంకు చెందిన సుద్దాల దేవయ్య 1981లో అంతర్గాం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1982లో టీడీపీలో చేరి 1987లో జడ్పీటీసీగా గెలిచి కరీంనగర్ జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. 1994, 1999 ఎన్నికల్లో నేరెళ్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు.
మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి ఖమ్మం జిల్లా లింగాల సర్పంచ్‌గా గెలిచి ఆ తర్వాత సుజాతనగర్ సెగ్మెంట్ నుంచి మూడుసార్లు, పాలేరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. సిద్దిపేట జిల్లా తుక్కాపూర్ సర్పంచ్‌గా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి దొమ్మాట ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచి చంద్రబాబు కేబినెట్‌లో పనిచేశారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీ హయాంలో పదేండ్లు మంత్రిగా పనిచేసిన కరణం రాంచందర్‌రావు తొలుత తన సొంతూరు పాపన్నపేట మండలం కొత్తపల్లి సర్పంచ్‌గా గెలిచారు.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన కొమిరెడ్డి రాములు, కరీంనగర్ జిల్లా గుండి గ్రామానికి చెందిన వెలిచాల జగపతిరావు, హుజూరాబాద్ మండలం జూపాకకు చెందిన కేతిరి సాయిరెడ్డి, గంగాధరకు చెందిన న్యాలకొండ రామకిషన్‌రావు, సిద్దిపేట జిల్లా బెక్కల్ గ్రామానికి చెందిన నాగపురి రాజలింగం, భూపాలపల్లి జిల్లా బుద్దారం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మెదక్ జిల్లా యూసుఫ్‌పేటకు చెందిన పటోళ్ల నారాయణరెడ్డి, కౌడిపల్లికి చెందిన చిలుముల విఠల్‌రెడ్డి, మాసాయిపేటకు చెందిన అంతిరెడ్డిగారి విఠల్‌రెడ్డి, వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన కొండేటి శ్రీధర్ సైతం మొదట సర్పంచ్‌గా పనిచేసి తర్వాత ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.
సొంతూరు నుంచి మొదలై..
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జువ్వాడి రత్నాకర్‌రావు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు. ఆయన తన స్వగ్రామం తిమ్మాపూర్‌కు పన్నెండేండ్ల పాటు సర్పంచ్‌గా పనిచేశారు. 1981లో జగిత్యాల సమితి అధ్యక్షుడిగా గెలుపొందారు. 1989లో బుగ్గారం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 1994లో ఓడిపోయినప్పటికీ... తిరిగి 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రిగా పనిచేశారు.
ఆదర్శ ఎమ్మెల్యేగా...
ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా న్యూడెమొక్రసీ పార్టీ తరఫున పోటీ చేసి ఐదు సార్లు గెలిచిన గుమ్మడి నర్సయ్య రాజకీయ ప్రస్థానం కూడా సర్పంచ్‌గానే మొదలైంది. 1981లో ఇల్లెందు తాలుకా పరిధిలోని ఉసిరికాయలపల్లి సర్పంచ్‌గా గెలిచారు. రెండేండ్ల పదవీకాలం కాగానే ఎమ్మెల్యే ఎన్నికలు రావడంతో సర్పంచ్ పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించి ఆదర్శ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు.
హెల్త్ మినిస్టర్‌గా...
వైఎస్ కేబినెట్‌లో హెల్త్ మినిస్టర్‌గా పనిచేసిన వనమా వెంకటేశ్వరరావు మొదటిసారి1971లో పాల్వంచ సర్పంచ్‌గా ఎన్నికై రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా, నాగార్జున గ్రామీణ బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1989లో మొదటిసారిగా కొత్తగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున మరో మూడు సార్లు గెలిచారు.
రెండుసార్లు సర్పంచ్.. మూడు సార్లు ఎమ్మెల్యే
పెద్దపల్లి ఎమ్మెల్యేగాపనిచేసిన గీట్ల ముకుందరెడ్డి గీట్ల కూనారం గ్రామం నుంచి 1970, 1976లో సర్పంచ్‌గా గెలిచారు. అనంతరం 1981లో స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి సమితి అధ్యక్షుడిగా గెలుపొందారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మొదటిసారి విజయం సాధించారు. ఆ తర్వాత మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
బొమ్మనపల్లి నుంచి అసెంబ్లీకి...
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు దేశిని చిన్నమల్లయ్య 1957లో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అక్కడి పటేల్, పట్వారీల ఆగడాలను ఎదిరించి నాలుగుసార్లు (21 ఏళ్లు) సర్పంచ్‌గా పనిచేశారు. 1978 జనరల్ ఎన్నికల్లో అప్పటి ఇందుర్తి నియోజకవర్గం (హుస్నాబాద్ నియోజకవర్గం) నుంచి సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచే 1984,1989, 1994 వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు.
సర్పంచ్ పదవితోనే రాజకీయాల్లోకి...
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సర్పంచ్ పదవితోనే రాజకీయ అరంగేట్రం చేశారు. 1984లో టీడీపీ నాయకుడిగా జైనథ్ మండలంలోని తన స్వగ్రామం దీపాయిగూడ సర్పంచ్‌గా తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత జైనథ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా గెలిచారు. 2009లో మొదటిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2012లో రాజీనామా చేసి టీఆర్‌ఎస్ తరపున ఉపఎన్నికల్లో సైతం గెలిచారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ తొలి కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2018లో మరోసారి ఎమ్మెల్యే గెలిచారు.
సర్పంచ్ నుంచి స్పీకర్ వరకు...
ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటారం మండలం (ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా) ధన్వాడ గ్రామానికి చెందిన దుద్దిళ్ల శ్రీపాదరావు నాగపూర్‌లో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాక ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలోనే తండ్రి చనిపోవడంతో సొంతూరుకు వచ్చారు. కొన్ని రోజులకు సర్పంచ్ ఎన్నికలు రావడంతో ప్రజల ఒత్తిడి మేరకు పోటీ చేసి గెలిచారు.
మరోసారి ఆయనే సర్పంచ్‌గా ఎన్నికై మహదేవపూర్ సమితి అధ్యక్షుడిగా కూడా పని చేశారు. ఈ క్రమంలోనే 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి.. టీడీపీ, ఎన్టీఆర్ హవాలోనూ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అన్ని పార్టీల మద్దతుతో 1999లో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.
