V6 News

సీఎంసీలో వన్ వార్డు ఎవ్రీ డే షురూ

సీఎంసీలో వన్ వార్డు ఎవ్రీ డే షురూ
  • మౌలిక సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న కమిషనర్​ సృజన
  • అమీన్​పూర్ ఆర్సీ పురం వార్డులో పర్యటన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీఎంసీ  కమిషనర్ సృజన సోమవారం ‘వన్ వార్డు ఎవ్రీ డే’ కార్యాక్రమాన్ని మొదలుపెట్టారు. సోమవారం అమీన్​పూర్ సర్కిల్ లోని ఆర్సీ పురం వార్డులో పర్యటించిన ఆమె అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. వార్డుల్లో సమస్యలను తెలుసుకునేందుకు రోజుకో వార్డులో పర్యటిస్తామన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 3 జోన్లు, 76 వార్డుల్లో ఈ పర్యటనలు నిరంతరాయంగా సాగుతాయన్నారు. ప్రధానంగా స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, పారిశుధ్యం వంటి  మౌలిక సదుపాయాలపై  దృష్టి పెట్టనున్నట్టు చెప్పారు. రాయసముద్రం చెరువు అభివృద్ధికి హెచ్ఎండీఏ ద్వారా రూ.15 కోట్లు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు.

చెరువులో ఉన్న గుర్రపు డెక్కను తొలగించాలని, పెండింగ్​లో ఉన్న అంశాలపై బీహెచ్ఈఎల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. కాకతీయ నగర్ పార్కులో స్ట్రీట్ లైట్ల కోసం ప్రత్యేక మీటర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మహిళా భవన్, కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తు నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని, మున్సిపల్ సర్కిల్ కార్యాలయాన్ని ఆర్సీ పురం ఎంపీడీఓ భవనానికి మార్చేందుకు  ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వార్డు సందర్శనలో ప్రజలు ఇచ్చే ఫీడ్​బ్యాక్ ఆధారంగా పనులు వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.