దేశంలో సైబర్ మోసాలు, ఫిషింగ్, స్కామ్‌లను అరికట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టాయ్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్ వంటి యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు ఇకపై తప్పనిసరిగా వినియోగదారు మొబైల్ నంబర్‌కు లింక్ చేయబడిన యాక్టివ్ సిమ్ కార్డుతో మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందుకోసం సదరు కంపెనీలకు 90 రోజులు గడువును ఇచ్చింది.
ఈ ఆదేశాలు 'టెలికమ్యూనికేషన్స్ (టెలికాం సైబర్ సెక్యూరిటీ) రూల్స్, 2024 సవరణలో భాగంగా అమలు చేయబడుతున్నాయి. డిజిటల్ అరెస్ట్, ప్రభుత్వ-ం పేరుతో నకిలీ కాల్స్, పెట్టుబడి మోసాలు వంటి సరిహద్దు మోసాలను అరికట్టడానికి కొత్త 'సిమ్-బైండింగ్' నిబంధనలు కీలకంగా మారనున్నాయి.
ప్రస్తుతం వినియోగదారు తమ సిమ్ తీసివేసినా, డీయాక్టివేట్ చేసినా లేదా విదేశాలకు వెళ్లినా.. మెసేజింగ్ యాప్ అకౌంట్లు పనిచేస్తూనే ఉన్నాయి. దీనివల్ల నేరగాళ్లు అసలు డివైజ్ లేదా సిమ్ అవసరం లేకుండానే సుదూర ప్రాంతాల నుండి బాధితుల ఖాతాలను నియంత్రించి మోసాలు చేస్తున్నారు. ఒక్కసారి భారతదేశంలో ధృవీకరించబడిన సెషన్ విదేశాల నుంచి పనిచేయడం నేరగాళ్లకు మోసాలు చేసేందుకు వీలు కల్పిస్తోందని కేంద్రం గుర్తించి సిమ్ బైండింగ్ రూల్స్ తీసుకొస్తోంది. దీని వల్ల ఇకపై యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడిన సిమ్ కార్డుతో నిరంతరం అనుసంధానం అయి ఉండాలి. యాక్టివ్ సిమ్ లేకుండా యాప్‌లను ఉపయోగించడం అసాధ్యంగా మారనుంది.
దీనికి తోడు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వెబ్ సెషన్ ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగ్అవుట్ రూల్స్ కూడా త్వరలోనే అమలులోకి రాబోతున్నాయి. అవసరమైతే QR కోడ్ ద్వారా వినియోగదారులు తమ డివైజ్ మళ్లీ లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి 6 గంటలకు రీ-అథెంటికేషన్ రిమోట్ దుర్వినియోగాన్ని అడ్డుకుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి యాక్టివ్ అకౌంట్, దాని వెబ్ సెషన్లు కేవైసీ ధృవీకరించబడిన సిమ్‌కు అనుసంధానించబడి ఉండేలా కొత్త రూల్స్ పనిచేస్తాయి. దీంతో మోసాలకు ఉపయోగించే నంబర్లను సులభంగా గుర్తించేందుకు వీలు కలగనుంది.
UPI ఆధారిత బ్యాంకింగ్, తక్షణ చెల్లింపు యాప్‌లకు ఇప్పటికే అమలులో ఉన్న సిమ్-బైండింగ్ విధానాన్ని ఇప్పుడు మెసేజింగ్ యాప్‌లకు కూడా విస్తరించడం విశేషం. అంతేకాకుండా ఫ్రాడ్ అకౌంట్లను అరికట్టడానికి మొబైల్ నంబర్ వ్యాలిడేషన్(MNV) ప్లాట్‌ఫారమ్‌ను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు టెలికాం రెగ్యులేటరీ తెలియజేసింది.
