2026 నుంచి అమల్లోకి రానున్న 10వ తరగతి బోర్డు పరీక్షల విధానంపై CBSE బోర్డు వివరణ ఇచ్చింది. చాలా మంది విద్యార్థులు మొదటి బోర్డు ఎగ్జామ్ రాయకుండా, డైరెక్ట్ సెకండ్ బోర్డు ఎగ్జామ్ రాయవచ్చా అని అడుగుతుండటంతో బోర్డు ఈ క్లారిటీ ఇచ్చింది. ప్రతి విద్యార్థి ఖచ్చితంగా మొదటి బోర్డు పరీక్షకు హాజరు కావాలి. మొదటి బోర్డు పరీక్ష రాయకుండా డైరెక్ట్ రెండో బోర్డు పరీక్ష రాయడానికి వీల్లేదు. మొదటి బోర్డు పరీక్షలో పాస్ అయిన విద్యార్థులు.. సైన్స్, మ్యాథ్స్, సోషల్ వంటి మూడు సబ్జెక్టుల్లో మార్కులను పెంచుకోవడానికి రెండో బోర్డు పరీక్ష అంటే ఇంప్రూవ్మెంట్ రాయవచ్చు.
మొదటి బోర్డు పరీక్షలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు హాజరు కాని విద్యార్థులను 'ఎసెన్షియల్ రిపీట్' కేటగిరీలో పెడతారు. వీరు రెండో పరీక్ష రాయడానికి వీల్లేదు. వీరు మళ్ళీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే పరీక్ష రాయాల్సి ఉంటుంది. కంపార్ట్‌మెంట్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ మొదటి బోర్డు పరీక్షలో ఒకటి లేదా రెండు సబ్జెక్టులు రాయని వారు రెండో పరీక్ష(Compartment)లో ఆ సబ్జెక్టులు రాసి పాస్ అవ్వచ్చు. 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఎక్స్ట్రా సబ్జెక్టులు రాయడానికి అవకాశం ఉండదు.
రెండో బోర్డు పరీక్ష ఎవరు రాయవచ్చు ?
* సైన్స్, మ్యాథ్స్, సోషల్ వంటి మూడు సబ్జెక్టుల్లో మార్కులు పెంచుకోవడానికి.
* కంపార్ట్‌మెంట్ వచ్చిన వారు పాస్ అవ్వడానికి.
* పాస్ అయిన వారు ఇంప్రూవ్‌మెంట్ కోసం.
మొదటి బోర్డు పరీక్షలో మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాయకపోయినా, ఫెయిల్ అయినా రెండో పరీక్షకు అనుమతించే ప్రసక్తే లేదని CBSE తేల్చి చెప్పింది. దీనిపై ఎటువంటి అభ్యర్థనలను కూడా బోర్డు స్వీకరించదని స్పష్టం చేసింది.
