
లక్నో: రామమందిర ప్రారంభోత్సవ వేళ కేవలం ఆహ్వానితులకే అయోధ్యలోకి ప్రవేశం కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కనులారా చూడాలని దేశవ్యాప్తంగా రామ భక్తులు కోరుకుంటున్నారు. దీంతో అయోధ్యలో రద్దీ పెరిగి అవాంఛిత సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే రద్దీని నియంత్రించేందుకు యోగి సర్కారు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆహ్వాన పత్రిక ఉన్న వారికి, ప్రభుత్వ విధినిర్వహణ కోసం వచ్చే వారికి మాత్రమే సిటీలోకి ఎంట్రీ కల్పించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు. జనవరి 22న అయోధ్యలోని హోటళ్లలో ఇప్పటికే చేసిన బుకింగ్స్‌ను రద్దు చేయాలని సూచించారు. దీనివల్ల ఆహ్వానితులకు వసతి కల్పించడం సులభం కావడంతో పాటు రద్దీని కూడా నియంత్రించవచ్చన్నారు.