రేషన్​ కార్డు రద్దయిందని ఫోన్​ చేసి..42 వేలు కొట్టేశారు

రేషన్​ కార్డు రద్దయిందని ఫోన్​ చేసి..42 వేలు కొట్టేశారు

కమలాపూర్, వెలుగు: రేషన్​కార్డు రద్దయిందని ఫోన్​చేసిన సైబర్​నేరగాళ్లు బ్యాంకు ఖాతాలోని రూ. 42 వేలు కొట్టేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్​మండలం మర్రిపెల్లిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద బీహార్​కు చెందిన రామ్ జిత్​యాదవ్​ జేసీబీ డ్రైవర్​గా చేస్తున్నాడు. గురువారం ఉదయం 11 గంటలకు రామ్​జిత్​కు మీ రేషన్​కార్డు క్యాన్సిల్​అయ్యిందంటూ ఫోన్​ చేశారు. కార్డు మళ్లీ యాక్టివ్​ చేయాలంటే ఫోన్​ నంబర్​కు వచ్చిన ఓటీపీ చెప్పాలన్నారు. వారి మాటలు నమ్మిన రామ్​జిత్​ఓటీపీ నంబర్​ చెప్పాడు. కాసేపటికే మళ్లీ ఫోన్ చేసి కార్డు యాక్టివ్​కాలేదని, మళ్లీ ఓటీపీ చెప్పాలన్నారు. రామ్​జిత్​వారికి నంబర్​చెప్పాడు. కొద్దిసేపటికే బ్యాంకు నుంచి రూ. 20 వేలు ఓసారి, రూ. 22 వేలు మరోసారి డ్రా అయినట్లు మెసేజ్​వచ్చింది. దాంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపరిచిత వ్యక్తులు ఫోన్​చేస్తే ఓటీపీ నంబర్ చెప్పవద్దని, ఫోన్​పే స్కానర్లను పంపవద్దని, లింక్​లు ఓపెన్​ చేయద్దని సీఐ సంజీవ్​కుమార్​ చెప్పారు. అనుకోకుండా సైబర్​ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్​కు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు కొంతవరకు తిరిగి పొందవచ్చన్నారు.