ఈ నెలలో మూడు వారాల పాటు కొనసాగిన హీట్ వేవ్స్ రికార్డు స్థాయిలో ప్రభావం చూపాయి. ఇది చాలా మంది మెక్సికన్‌లను సైతం ఉక్కిరిబిక్కిరి చేసింది.
మెక్సికో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ సారి బీభత్సం సృష్టించాయి. ఎన్నడూ లేనంతగా 50 డిగ్రీల సెల్సియస్ (122 ఫారెన్‌హీట్)కి చేరుకోవడంతో వేడి సంబంధిత కారణాల వల్ల మెక్సికోలో గత రెండు వారాల్లో కనీసం 100 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూన్ 29న తెలిపింది. ఈ మరణాలలో మూడింట రెండు వంతుల మరణాలు జూన్ 18-24 వారంలో సంభవించాయి. మిగిలినవి మునుపటి వారంలో సంభవించాయని మంత్రిత్వ శాఖ తీవ్ర ఉష్ణోగ్రతలపై ఒక నివేదికలో తెలిపింది. గతేడాది ఇదే కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కేవలం మరణం మాత్రమే నమోదైంది.
ఈ సారి నమోదైన దాదాపు అన్ని మరణాలు హీట్ స్ట్రోక్ వల్లే సంభవించాయి. కొంత మంది డీహైడ్రేషన్‌తో చనిపోయినట్టు తెలుస్తోంది. దాదాపు 64% మరణాలు టెక్సాస్ సరిహద్దులోని ఉత్తర రాష్ట్రమైన న్యూవో లియోన్‌లో సంభవించాయి. మిగిలిన వాటిలో ఎక్కువ భాగం గల్ఫ్ తీరంలో పొరుగున ఉన్న తమౌలిపాస్, వెరాక్రూజ్‌లో జరిగాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు అవసరమైన అవపాతాన్ని తీసుకురావడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కానీ కొన్ని ఉత్తరాది నగరాల్లో ఇప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోనోరా రాష్ట్రంలోని అకోంచి పట్టణంలో జూన్ 28న గరిష్టంగా 49 డిగ్రీల సెల్సియస్ (120 ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైంది.
