మంచిర్యాల వడ్లు.. పెద్దపల్లిలో దించుకోవట్లే... ఇంతవరకు రైస్మిల్లుల జాబితా ఇవ్వని అధికారులు

మంచిర్యాల వడ్లు..  పెద్దపల్లిలో దించుకోవట్లే... ఇంతవరకు రైస్మిల్లుల జాబితా ఇవ్వని అధికారులు
  • జిల్లాకు 50 వేల మెట్రిక్​టన్నులు కేటాయింపు
  •  
  •     ఫలితంగా ట్రాన్స్​పోర్ట్ జాప్యం.. గోస పడుతున్న రైతులు
  •     కరీంనగర్​ జిల్లాకు మరో 50 వేల మెట్రిక్​టన్నులు 
  •     జిల్లాలోని మెజారిటీ మిల్లులు బ్లాక్​లిస్టులో ఉండడం వల్లే తిప్పలు 

మంచిర్యాల, వెలుగు:  మంచిర్యాల జిల్లాలో సేకరించిన వడ్లను పెద్దపల్లి జిల్లాలోని మిల్లుల్లో దించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్​లో జిల్లావ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్​ టన్నుల ప్యాడీ ప్రొక్యూర్​మెంట్​ చేయాలన్నది టార్గెట్. జిల్లాలో ఇప్పటివరకు 20 శాతం ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 80 శాతం సేకరించాల్సి ఉన్నది. మంచిర్యాలలో 55 రైస్​ మిల్లులు ఉన్నప్పటికీ వీటిలో సుమారు 26 మిల్లుల్లో సీఎంఆర్ బకాయిలు పేరుకుపోవడంతో బ్లాక్​లిస్టులో చేర్చారు. ఈ సీజన్​లో ఇప్పటివరకు 12 మిల్లులకు మాత్రమే ట్యాగింగ్​ఇచ్చారు. 

ఈ మిల్లుల కెపాసిటీ 50 వేల మెట్రిక్​టన్నులకు మించి లేకపోవడంతో మిగతా ధాన్యాన్ని పక్క జిల్లాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొరుగునున్న పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో వందల సంఖ్యలో రైస్​మిల్లులు ఉన్నాయి. లోకల్ ప్రొక్యూర్​మెంట్​కంటే అక్కడి మిల్లుల కెపాసిటీ ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఆ రెండు జిల్లాలకు ధాన్యం తరలించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారులు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు 50 వేల మెట్రిక్​టన్నుల చొప్పున మొత్తం లక్ష టన్నులు కేటాయించారు. మిగతా 50 వేల టన్నుల ధాన్యాన్ని జిల్లాలో ఏఎంసీ, ఎస్​డబ్ల్యూసీ గోడౌన్లు, బ్లాక్​ లిస్టులో ఉన్న రైస్​మిల్లులతో పాటు 55 రైతు వేదికల్లో నిల్వ చేయడానికి కలెక్టర్​కుమార్​దీపక్​సంబంధిత అధికారులకు ఆర్డర్స్​జారీ చేశారు.

స్పందించని పొరుగు జిల్లాల అధికారులు

మంచిర్యాల జిల్లాలో బుధవారం వరకు 40,280 మెట్రిక్​టన్నుల ధాన్యాన్ని పీపీసీల ద్వారా సేకరించారు. ఇందులో 29,556 టన్నులు రైస్​మిల్లులకు తరలించగా, ఇంకా 10,723 టన్నుల ధాన్యం సెంటర్లలోనే ఉన్నది. అకాల వర్షాలు పడుతుండడంతో వడ్లు తడిసిపోయి రైతులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు లిఫ్ట్​చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయమై మంచిర్యాల కలెక్టర్​తో పాటు సివిల్ సప్లై ఆఫీసర్లు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని వివరించినప్పటికీ వారు సరిగా స్పందించడం లేదని సమాచారం. 

కరీంనగర్​లో 10 వేల టన్నులు, పెద్దపల్లిలో 5 వేల టన్నులకు గోడౌన్లు కేటాయించినప్పటికీ మిల్లుల వివరాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని తెలిసింది. మంచిర్యాల నుంచి పంపించే ధాన్యాన్ని దించుకోవడానికి అక్కడి రైస్​మిల్లర్లు రెడీగా ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ముందుగా లోకల్​ప్యాడీ దించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయా జిల్లాల్లో సేకరించిన వడ్లను పూర్తిస్థాయిలో మిల్లులకు తరలించిన తర్వాతనే మంచిర్యాల జిల్లా వడ్లను దించుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో ఇప్పటివరకు కరీంనగర్​కు జిల్లాకు వెయ్యి మెట్రిక్​టన్నులు తరలించగా, పెద్దపల్లి జిల్లాకు ఒక్క లారీ కూడా పంపలేని పరిస్థితి నెలకొన్నదని అధికారులు పేర్కొంటున్నారు.

ఎంపీ వంశీకృష్ణ ఫోన్​ చేసినా పెద్దపల్లి కలెక్టర్​ నో రెస్పాన్స్ 

ఓవైపు సెంటర్లలో వడ్ల బస్తాలు పేరుకుపోవడం, మరోవైపు అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి కలెక్టర్​కోయ శ్రీహర్షతో మాట్లాడేందుకు ఫోన్​చేసినా ఆయన రెస్పాండ్​ కావడం లేదని సమాచారం. దీంతో ఆయన కలెక్టర్ ​తీరును సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. రెండు రోజుల కిందటే ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించి కొనుగోళ్లు స్పీడప్​ చేయాలని, రైతులకు నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయినప్పటికీ కొంతమంది కలెక్టర్ల తీరు మారకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.