కరీంనగర్ జిల్లాలో మిల్లర్ల అక్రమాలు: ఐదు మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..

కరీంనగర్ జిల్లాలో మిల్లర్ల అక్రమాలు: ఐదు మిల్లుల్లో రూ.20 కోట్ల వడ్లు మాయం..
  • 20 మిల్లులపై క్రిమినల్ కేసులు.. సివిల్ సప్లై విజిలెన్స్ దాడుల్లో మిల్లర్ల అక్రమాలు వెలుగులోకి..
  • గతంలో 38 మిల్లుల్లో 56 వేల టన్నులు పక్కదారి 
  • ఆయా మిల్లుల నుంచి రావాల్సిన రూ.185 కోట్లు పెండింగ్​లోనే..
  • ఆస్తుల జప్తులో మీనమేషాలు లెక్కిస్తున్న ఆఫీసర్లు 

కరీంనగర్, వెలుగు: సివిల్ సప్లై విజిలెన్స్ అధికారుల దాడుల్లో రైస్ మిల్లర్ల అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సోమవారం, బుధవారాల్లో కరీంనగర్​ జిల్లాలోని ఐదు మిల్లుల్లో చేపట్టిన తనిఖీల్లో రూ.20 కోట్ల విలువైన వడ్లు మాయమైనట్లు గుర్తించారు. దీంతో హుజురాబాద్​లోని జగన్మాత మిల్లుపై క్రిమినల్ కేసు నమోదు చేయగా.. మిగతా మిల్లులపై చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 2022 నుంచి 2024 వరకు ఖరీఫ్, రబీ సీజన్లలో 38 మిల్లుల్లో 56 వేల టన్నుల మేర ఎగవేశారు. ఆయా మిల్లుల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన రూ.185 కోట్లు పెండింగ్ లోనే ఉన్నాయి. 

38 మిల్లుల నుంచి రూ.185 కోట్ల బకాయిలు

గత సర్కార్ హయాంలో సీఎంఆర్ కోసం అప్పగించిన వడ్లలో అనేక మిల్లుల్లో అక్రమాలు జరిగాయి. సీఎంఆర్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి, ఇతర రాష్ట్రాల్లో అమ్మేశారు. సివిల్ సప్లై అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేసినా.. గడువు మీద గడువు పెంచినా బకాయిలు చెల్లించకుండా మొండికేస్తున్నారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లికి చెందిన శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ నుంచి 22,122 మెట్రిక్ టన్నులకు సంబంధించి రూ.54.18 కోట్లు, జమ్మి కుంట మండలం కోరపల్లి మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్ యాజమాన్యం 19,860 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.49.83 కోట్లు రావాల్సి ఉంది. 

బండారు మారుతి, ఆయన భార్య పేరిట ఉన్న ఈ రెండు మిల్లుల నుంచి మొత్తం రూ.రూ.104 కోట్లు మేర సర్కారుకు రావాల్సి ఉంది. ఇప్పటికే వీరిద్దరిపై జమ్మికుంట, ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోనూ మారుతి సుమారు రూ.20 కోట్ల విలువైన ధాన్యం దారి మళ్లించడంతో కేసు నమోదైంది. అయినా ఇప్పటివరకు డబ్బులు రికవరీ చేయలేదు.

జాబితాలో మరికొన్ని.. 

మానకొండూరు శ్రీనిధి ట్రేడర్స్, పెద్దపాపయ్యపల్లి రవిచంద్ర ఇండస్ట్రీస్, బోర్నపల్లిలోని వరుణ్ ఇండస్ట్రీస్, సాయి ట్రేడర్స్, చొప్పదండి శ్రీశ్వేత ఆగ్రో ఇండస్ట్రీస్ ఒక్కో మిల్లు 2 వేల మెట్రిక్ టన్నులకుపైగా పెండింగ్ లో ఉన్నాయి. మానకొండూరు శ్రీవీరభద్ర ఇండస్ట్రీస్, రేణికుంట ఆర్కే ఇండస్ట్రీస్​, జమ్మికుంట సప్తగిరి ఇండస్ట్రీస్, శ్రీదేవి ఇండస్ట్రీస్, గోపాలపూర్ శ్రీలక్ష్మి వెంక టేశ్వర ట్రేడర్స్ కోట్లలో బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో తాజాగా విజిలెన్స్ అధికారులు హుజురాబాద్ బోర్నపల్లిలోని శ్రీసాయి ట్రేడర్స్(కేరాఫ్​జగన్మాత)లో సోదాలు నిర్వహించగా 3061 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. 

వీటి విలువ 25 శాతం ఫైన్ తో కలిపి రూ.7.84 కోట్లుగా నిర్ధారించి సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేశారు. జమ్మికుంటలోని సప్తగిరి రైస్ మిల్లుపైనా త్వరలో కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. గతంలో 20 మిల్లులపై ఆర్ ఆర్ యాక్ట్ కింద క్రిమినల్ కేసు నమోదు చేయగా.. తాజాగా మరో 18 మిల్లులపై కేసులు పెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 

రెండు సార్లు గడువు ఇచ్చినా బకాయిలు చెల్లించలే.. 

బకాయిలు చెల్లించేందుకు రెండు సార్లు ఐదు నెలలపాటు గడువు ఇచ్చినా బకాయిలు పెద్దగా వసూలు కాలేదు. దీంతో 20 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కానీ ఆర్ఆర్ యాక్ట్ ను అమలు చేసి బకాయిదారుల ఆస్తుల జప్తులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. రూ.104 కోట్ల బకాయి ఉన్న కరీంనగర్ జిల్లాలో అధికారులు కేసు నమోదు చేసి వదిలేస్తే.. రూ.20 కోట్ల బకాయి ఉన్న పెద్దపల్లి జిల్లాలో పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడం గమనార్హం.

క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.. 

గతంలో సీఎంఆర్ కోసం అప్పగించిన ధాన్యాన్ని దారి మళ్లించిన 20 మిల్లులపై ఆర్ ఆర్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేశాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఆస్తుల జప్తునకు చర్యలు తీసుకుంటున్నాం. జూన్ 26తో వారికి ఇచ్చిన గడువు ముగిసింది. మరో 18 మిల్లులపై కేసుల నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 
-రజినీకాంత్, డీఎం, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్, కరీంనగర్