
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత బార్డర్ లో రోజూ కాల్పులకు దిగుతూ, యుద్ధ విన్యాసాలు చేపడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్ తాజాగా ఇండియాను మరింత రెచ్చగొట్టేలా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. శనివారం ‘ఇండస్ ఎక్సర్ సైజ్’లో భాగంగా ‘అబ్దలీ వెపన్ సిస్టం’ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించామని పాక్ ఆర్మీ ప్రకటించింది. ఉపరితలం నుంచి ఉపరితలంలో 450 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని తెలిపింది.
‘‘సైనిక బలగాల సన్నద్ధతలో భాగంగా ఈ మిసైల్ పరీక్ష నిర్వహించాం. అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టం, మెరుగుపర్చిన విన్యాసాలతో సహా ఈ క్షిపణి అన్ని రకాలుగా సత్తా చాటింది” అని పాక్ ఆర్మీ పేర్కొంది. అబ్దలీ మిసైల్ టెస్టుతో పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయని, ఎలాంటి దాడి జరిగినా తమను తాము కాపాడుకుంటామని ఆ దేశ ప్రెసిడెంట్ అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ ధీమా వ్యక్తం చేశారు.