- ఖమ్మం జిల్లాలో 571 పంచాయతీల్లో 8,02,691 మంది ఓటర్లు
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీల్లో 6,69,048 ఓటర్లు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారు. పాత పద్ధతిలో రిజర్వేషన్లను ఫైనల్ చేస్తున్నారు. మూడు దశలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా పంచాయతీ ఆఫీసర్లను ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణకు మరోసారి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం రిలీజ్చేయడంతో పల్లెల్లో సందడి నెలకొంది.
ఇటు 8,02,691.. అటు 6,69, 048 మంది ఓటర్లు
ఖమ్మం జిల్లాలోని 571 పంచాయతీల్లో 8,02,691 మంది ఓటర్లు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీల్లో 6,69, 048ఓటర్లు ఉన్నారు. మొదటి, రెండు, మూడో దశల్లో ఏఏ మండలాలను చేర్చాలో అనే విషయమై కసరత్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్‌ను ఆఫీసర్లు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మూడు దశల్లో నిర్వహించే పంచాయతీల వివరాలను కలెక్టర్ ఆమోదంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ..
పంచాయతీ ఎన్నికలను పాత పద్ధతిలోనే నిర్వహించనుండడంతో ఇందుకు సంబంధించి రిజర్వేషన్లను ఆఫీసర్లు ఫైనల్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో ఉన్న రిజర్వేషన్లను యథాతధంగా ఉంచుతారా, రోటేషన్పద్ధతిలో రిజర్వేషన్లు మారుతాయా అనే చర్చ జిల్లాలో సాగుతోంది. 42శాతం రిజర్వేషన్లు బీసీలకు కుదరదని, 50శాతం రిజర్వేషన్లు మించకుండా ఉండాలనే హైకోర్టు సూచనలతో గతంలో ఉన్న రిజర్వేషన్ల శాతం ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు పోతుండడంతో బీసీల్లో కొంత నిరాశ నెలకొంది.
ఓటర్ల జాబితా సవరణకు..
పంచాయతీ ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల 23 వరకు ఓటర్ల జాబితాలో సవరణలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. తామున్న ప్రాంతం కాకుండా ఇతరత్రా ఏదేని పోలింగ్‌బూత్‌లో ఓటర్లు ఉంటే వాళ్లు ఈ సవరణ ద్వారా మార్చుకునే అవకాశం ఉంది. కాగా, అప్పుడే పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే ఆశావహులు ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల ముఖ్య నేతల చుట్టూ చేరుతున్నారు.
